ఎస్టీపీల నిర్మాణ పనులపై జలమండలి ఎండీ దానకిశోర్ సమీక్ష

హైదరాబాద్ (CLiC2NEWS): ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో బుధవారం జలమండలి అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో ఎండీ దానకిశోర్ సమీక్ష నిర్వహించారు.సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల(ఎస్టీపీ) నిర్మాణ పనులను వేగవంతం చేసి, అనుకున్న సమయానికి పూర్తయ్యేలా చూడాలని జలమండలి ఎండీ దానకిశోర్ ఆదేశించారు. హైదరాబాద్ మహానగరంలో ఉత్పత్తయ్యే మురుగు నీటిని వంద శాతం శుద్ధి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.3,866.21 కోట్ల వ్యయంతో 31 కొత్త సీవరేజి ట్రీట్‌మెంట్ ప్లాంట్ల(ఎస్టీపీ)ను జలమండలి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దానకిశోర్ మాట్లాడుతూ. ఎస్టీపీల నిర్మాణంలోని ఎస్బీఆర్, వెట్‌వెల్, సీసీటీ, ఎయిర్ బ్లోవర్ రూమ్ తదితర పనులను ఏకకాలంలో, సమాంతరంగా చేపట్టాలని సూచించారు.
ఎస్టీపీల నిర్మాణంలో రక్షణ చర్యలు కచ్చితంగా పాటించేలా చూడాలని ఆదేశించారు. కార్మికులు తప్పనిసరిగా రక్షణ పరికరాలు ఉపయోగించాలన్నారు. నిర్మాణాలు జరుగుతున్న ప్రాంగణాల చుట్టూ బారీకేడ్లు ఏర్పాటుచేయాలని సూచించారు. ఇప్పటికే ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల ద్వారా జలమండలి ప్రధాన కార్యాలయం నుంచి కూడా నిరంతరం పనులను పర్యవేక్షించాలని సంబంధిత ఉన్నతాధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జలమండలి ఈడీ డా.ఎం.సత్యనారాయణ, ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీధర్ బాబు, ఎస్టీపీ సీజీఎంలు, జీఎంలు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.