జలమండలి మహిళా ఉద్యోగులకు సన్మానం

హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని జలమండలి కార్యాలయంలో మహిళా ఉద్యోగులను ఘనంగా సత్కరించారు. ఒక దేశ నాగరికత ఆ దేశ మహిళలకు ఇచ్చే గౌరవాన్ని బట్టి తెలుస్తుందని ఎండీ దానకిశోర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా జలమండలి ఖైరతాబాద్ లోని ప్రధాన కార్యాలయంలో మహిళా సంక్షేమ దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఎండీ మాట్లాడుతూ.. ఇంటా బయటా స్త్రీల పాత్ర ఎంతో కీలకమన్నారు. ఇటు కుటుంబాన్ని, అటు ఉద్యోగాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లటం వారికే సాధ్యమని కొనియాడారు. చాలా ఇబ్బందుల మధ్య మహిళలు పని చేస్తారని.. వారందర్నీ గౌరవించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని వివరించారు. మన ఇంట్లో స్త్రీలకు ఎలాంటి గౌరవమిస్తామో.. కార్యాలయాల్లో ఉద్యోగ సహచరిణిలకు సైతం అలాగే ఇవ్వాలని సూచించారు.
జలమండలి పరిధిలో వివిధ హోదాల్లో దాదాపు 600 మంది మహిళా ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరిలో దాదాపు 50 మందిని ఎంపిక చేసి ఈ మహిళా సంక్షేమ దినోత్సవం సందర్భంగా వారిని శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఈడీ డా.ఎం.సత్యనారాయణ, ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీధర్ బాబు, రెవెన్యూ డైరెక్టర్ వి.ఎల్. ప్రవీణ్ కుమార్, ఆపరేషన్స్ డైరెక్టర్-2 స్వామి, టెక్నికల్ డైరెక్టర్ రవి కుమార్, సీజీఎంలు మహమ్మద్ అబ్దుల్ ఖాదర్, దశరథ్ రెడ్డి, వినోద్ భార్గవ, విజయరావు, టి.వి.శ్రీధర్, ప్రభు, పద్మజ, సుజాత, నాగేంద్ర కుమార్, ఆనంద్ నాయక్, సుదర్శన్, అమరేందర్ రెడ్డి, వాటర్ వర్స్క్ ఎంప్లాయిస్ యూనియన్ అసోసియేషన్, తెలంగాణ అధ్యక్షుడు రాంబాబు యాదవ్, అసోసియేట్ ప్రెసిడెంట్లు రాజిరెడ్డి, జహంగీర్, జనరల్ సెక్రటరీ జయరాజ్, జీఎంలు, మహిళా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.