ద‌ళితుల కోసం నా చివ‌రి ర‌క్త‌పుబొట్టు దాకా పోరాడుతా : ముఖ్య‌మంత్రి కెసిఆర్‌

తెలంగాణ సాధించిన‌ట్లే.. ద‌ళితుల స‌మ‌గ్రాభివృద్ధి సాధిస్తా..

క‌రీంన‌గ‌ర్ (CLiC2NEWS): నా చివరి రక్తపుబొట్టు దాకా దళితుల సమగ్రాభివృద్ధి కోసం పోరాడుతానని ముఖ్య‌మంత్రి కెసిఆర్ ప్రకటించారు. ప్రాణత్యాగానికి సిద్ధపడి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విధంగానే దళితబంధు విజయవంతం కోసం అంతే గట్టిగా పట్టుపడతానని సిఎం పేర్కొన్నారు. కరీంనగర్‌ కలెక్టరేట్‌లో ఇవాళ (శుక్ర‌వారం) దళితబంధు పథకంపై ముఖ్య‌మంత్రి కెసిఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ స‌మీక్ష‌లో మంత్రులు హరీశ్​రావు, కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌తో పాటు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్య‌మంత్రి మాట్లాడుతూ.. దళితజాతి పేదరికంలో మగ్గిపోతూ సామాజిక వివక్షకు గురవడానికి సభ్య సమాజమే కారణం అని తెలిపారు. ఎన్నటి నుంచి ఎవరు పెట్టిండ్రోగాని ఇది దుర్మార్గమైన ఆచారం, ఇప్పటికైనా దళితుల పట్ల అనుసరిస్తున్న దురాచారాన్ని కట్టడి చేసి వారి ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి తెలంగాణ సమాజమంతా కదిలిరావాలి అని సిఎం పిలుపునిచ్చారు. పట్టుబట్టి తెలంగాణ సాధించుకున్నామని, అదే పట్టుదలతో తెలంగాణ స్వరాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామని, దళితుల సమగ్రాభివృద్ధి కూడా అంతే పట్టుదలతో సాధించుకుని తీరుతామని కెసిఆర్‌ స్పష్టం చేశారు.

తెలంగాణను ఏడేండ్లలో అద్భుతంగా అభివృద్ధి చేసుకున్నం. అన్ని రంగాలను, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని వర్గాలకు అండదండలు అందిస్తూ గత ఏడేండ్లుగా తెలంగాణ ప్రభుత్వం నేనున్నాననే ధీమాను, స్ఫూర్తిని అందిస్తున్నది అని కేసీఆర్ పేర్కొన్నారు.

రైతుబంధు, రైతు బీమాతో రైతులకు వ్యవసాయానికి ఉపశమనాన్ని కలిగించినం. గత వలసపాలనలో అన్ని రంగాల్లో గాడి తప్పిన తెలంగాణ నేడు ఒక దరికి చేరుకున్నది. దళితబంధు గత సంవత్సరం మే నెల‌లోనే ప్రారంభమయ్యేది ఉండే, కానీ కరోనా కారణం చేత ఆలస్యమైంది అని కేసీఆర్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.