ఐఐటి మద్రాస్.. వరుసగా ఆరోసారి ప్రథమ స్థానం
ఢిల్లీ (CLiC2NEWS): ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి (ఐఐటి మద్రాస్).. వరుసగా ఆరో ఏడాది అగ్ర స్థానంలో నిలిచింది. దేశంలో ఉత్తమ విద్యా సంస్థల జాబితాను కేంద్ర విద్యాశాఖ సోమవారం విడుదల చేసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ జాబితాను విడుదల చేశారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ కింద రూపొందించిన ఈ జాబితాలో అత్యుత్తమ విద్యాసంస్థ (ఓవరాల్)గా ఐఐటి మద్రాస్ ప్రథమ స్థానంలో నిలిచింది. ఉత్తమ విశ్వవిద్యాలయాల విభాగంలో ఐఐఎస్‌సి బెంగళూరు మొదటి స్థానాన్ని దక్కించుకుంది.
2016 నుండి విద్యాసంస్థల్లో అందిస్తోన్న విద్యాబోధన , కల్పిస్తున్న సౌకర్యాల ఆధారంగా ర్యాంకులను కేంద్రం ప్రకటిస్తోంది. యూనివర్సిటిలు, కాలేజిలు, రీసర్చ్ ఇన్‌స్టిట్యూషన్లు, ఇంజినీరింగ్, మేనేజ్ మెంట్, ఫార్మసి, మెడికల్ .. ఇలా మొత్తం 13 విభాగాల్లో ర్యాంకులను ప్రకటించారు.
ఉన్నత విద్యా సంస్థల్లో .. ఐఐటి మద్రాస్ మొదటి స్థానంలో ఉండగా.. ఐఐఎస్‌సి బెంగళూరు, ఐఐటి బాంబే రెండు, మూడో స్థానంలో నిలిచాయి. టాప్ టెన్‌లో ఎనిమిది ఐఐటిలు, ఎయిమ్స్ ఢిల్లీ, జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సటి చోటు దక్కించుకున్నాయి.
ఇంజినీరింగ్ విభాగంలో.. ఐఐటి మద్రాస్ వరుసగా 9వ సారి ప్రధమ స్థానంలో నిలిచింది. ఐఐటి ఢిల్లీ, ఐఐటి బాంటే రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఐఐటి హైదరాబాద్ ఇంజినీరింగ్ విభాగంలో ఎనిమిదో స్థానంలో నిలిచింది.
ఆవిష్కరణల విభాగంలో ..ఐఐటి బాంబే, ఐఐటి మద్రాస్, ఐఐటి హైదరాబాద్ వరుసగా తొలి మూడు స్థానాలు దక్కించుకున్నాయి.
పరిశోధన విద్యాసంస్థల్లో .. ఐఐఎసి బెంగళూరు మొదటి స్థానంలో నిలవగా, ఐఐటి మద్రాస్, ఐఐటి ఢిల్లీ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
మెడికల్ విభాగంలో.. ఢిల్లీలోని ఎయిమ్స్ ప్రథమ స్థానంలో నిలిచింది. చండీగఢ్‌లోని పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆప్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ , వేలూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజి తర్వాత స్థానంలో నిలిచాయి.