ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం.. తీర ప్రాంతాలకు అలర్ట్
విశాఖ (CLiC2NEWS): ఆగ్నేయ బంగాళాఖాతంలో మంగళవారం అల్పపీడం ఏర్పడింది, ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) ప్రకటించింది. అండమాన్, నికోబార్ దీవులకు సమీపంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారనుందని.. ఇది ఎల్లుండి వరకు ఒడిశా తీరానికి చేరుకుంటుందని తెలిపారు. దీంతో తీర ప్రాంతాలను అప్రమత్తం చేస్తున్నారు. ఎపితో పాటు తమిళనాడు, పుదచ్చేరిలో బుధవారం భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు సమాచారం. రానున్న అయిదు రోజుల్లో ఎపిలోని వివిద ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఒడిశా, పశ్చిమబెంగాల్‌లో కూడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని ఐఎండి తెలిపింది.
అల్పపీడనం వాయుగుండంగా బలపడే సమయంలో గరిష్టంగా గంటకు 70 కిలో మీటర్ల వేగంతో గాలులు వీయోచ్చని, ఉత్తరాంధ్ర, యానాం తీరాలకు సమీపంలో సముద్ర కెరటాల ఉధృతి అధికంగా ఉండొచ్చని తెలిపింది. బుధ గురువారాల్లో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.