48 గంటల్లో ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన
విశాఖ (CLiC2NEWS): రాగల 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తాలోనూ తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాయలసీమ ప్రాంతాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.
దక్షిణకోస్తాలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. రానున్న 48 గంటలపాటు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.
అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో ఆదివారం పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో అత్యధికంగా 70.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. అలాగే ఏలూరులో 51.4 మి.మీ. కురిసింది.