ఈ దుశ్శాసన దుర్వినీతి లోకంలో..
ఈ కలియుగ దుశ్శాసన దుర్వినీతి లోకంలో
మానవత్వం మంటల్లో మసైపోతోంది ఈ అవనిలో..!
పసి కునల ఆక్రందనలు వినిపిస్తున్నా
వినపడనట్టు నటిస్తూ
కనులకు గంతలు కట్టుకుని
బ్రతికే వారెందరో ఈ అవనిలో..!
గుండె గూటిలో పదిలంగా దాచుకున్న కలల ప్రపంచాన్నీ
చెల్లాచెదురు చేస్తూ పసిపాపల బ్రతుకులను బుగ్గిపాలు చేస్తు కళ్ళపడని మేకవన్నెపులులెన్నో
ఈ అవనిలో..!
మగ మృగాల (కొంత మంది మాత్రమే)అన్యాయ కరాళ నృత్యానికి భయపడి దయ కరుణ జాలి ఆటుకు ఎక్కి కూర్చున్నాయి, ఈ అవనిలో..!
కలియుగ దుశ్శాసనలు పశువులుగా మారి
పసి మొగ్గల సమాధులే కడుతుంటే
ఏమైపోతుంది మహిళా ప్రపంచం ఈ అవనిలో..!
ఓ మగువా నీ అక్షరమే ఆయుధమై…
స్త్రీలు, ఆడపిల్లలు, పసిపాపలు పట్టపగలు స్వేచ్ఛగా తిరిగే లోకాన్ని సృష్టించు ఈ అవనిలో..!
ఓ మగువా అపర ఝాన్సీ రుద్రమదేవిలా
కలుపుమొక్కలను ఏరి పారేసి స్త్రీలు, ఆడపిల్లలు, పసిపాపలు పట్టపగలు స్వేచ్ఛగా తిరిగే లోకాన్ని సృష్టించు ఈ అవనిలో..!
-మంజుల పత్తిపాటి