పాక్ నుండి వచ్చే దిగుమతులపై నిషేధం..

ఢిల్లీ (CLiC2NEWS): పాక్ నుండి వచ్చే దిగుమతులపై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు దేశ భద్రత, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. పాకిస్థాన్ నుండి మన దేశానికి రవాణా అయ్యే అన్ని ఉత్పత్తులకు ఈ నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది. పహల్గాం ఉగ్రదాడి జరిగిన అనంతరం భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ రెండు దేశాల మధ్య వాణిజ్యానికి ఉన్న ఏకైక రవాణా మార్గం అటారీ – వాఘా సరిహద్దును మూసివేశారు. మరోవైపు పాకిస్తాన్‌తో సముద్ర రవాణా మార్గాలను భారత్ మూసివేసింది. ఆ దేశ జెండాతో ఉన్న ఓడలు భారత పోర్టుల్లోకి రాకుండా కేంద్రం నిషేధం విధించింది. అదేవిధంగా భారత ఓడలు కూడా పాక్ పోర్టుల్లోకి వెళ్లకూడదని స్పష్టం చేసింది.
పాక్ నుండి భారత్‌కు వచ్చే అన్నిరకాల వస్తువుల ప్రత్యక్ష , పరోక్ష దిగుమతులపై నిషేధం విధిస్తున్నాం. అనుమతులు ఉన్న ఉత్పత్తులైనా, స్వేఛ్చాయుత దిగుమతులైనా సరే పాక్ నుండి ఎలాంటి వస్తువులను అనుమతించబోము. ఈ నిషేధం అమల్లోకి వస్తుంది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయి. ఈ నిషేధం నుండి ఏమైనా మినహాయింపులు కావాలంటే .. భారత ప్రభుత్వం నుండి ముందస్తు అనుమతి తప్పనిసరి అని వాణిజ్య మంత్రిత్వ శాఖ తమ నోటిఫికేషన్‌లో వెల్లడించింది.
ఇప్పటికే పాక్ విమానాలకు మన గగనతలాన్ని మూసివేశారు. పహల్గాం లో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిలో భాగంగా ముందుగా సింధూ జలాల ఒప్పందం అమలును నిలిపివేయడంతో పాటు పాక్ పౌరులు తక్షణమే భారత్‌ను వీడి వేళ్లాలని ఆదేశించింది.