జమ్మూలో పాక్ ఆత్మాహుతి డ్రోన్ దాడులు..

అఖ్నూర్ (CLiC2NEWS): భారత్ ప్రతీకార దాడుల అనంతరం పాకిస్తాన్.. భారత్ సైనిక స్థావరాలపై దాడులకు ప్రయత్నించింది. వాటిని భారత సైన్యం తిప్పికొట్టింది. అనంతరం పాక్ తన ఉనికిని చాటుకొనేందుకు ప్రయత్నిస్తోంది. జమ్మూ ఎయిర్‌పోర్టు సమీపంలో పాకిస్థాన్ ఆత్మాహుతి డ్రోన్ దాడులకు పాల్పడినట్లు సమాచారం. వాటిని కూడా భారత బలగాలు తిప్పికొడుతున్నాయి. జమ్ము జిల్లా వ్యాప్తంగా సైరన్లు మోగిస్తున్నారు. జమ్మూతో సహా పఠాన్కోట్, ఉదమ్‌పుర్‌లలో దాడులు కొనసాగుతున్నట్లు సమాచారం. పలుచోట్ల భారీగా శబ్దాలు వినిపిస్తున్నాయి. అఖ్నూర్ , కిష్త్వార్, సాంబా సెక్టార్ లో అధికారులు పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. సరిహద్దు రాష్ట్రాల్లోని పలు నగరాల్లో బ్లాక్ అవుట్ పాటించారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సైన్యం హెచ్చరికలు జారీ చేసింది. పలు ప్రాంతాల్లో కరెంటును నిలిపివేశారు. ఆస్పత్రులు , జైళ్లను మినహాయించారు.
భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో జమ్ముకశ్మీర్ , పంజాబ్ రాష్ట్రాల్లో హైఅలర్ట్ జారీ చేశారు. జమ్ము యూనివర్సిటికి సమీపంలో రెండు డ్రోన్లను భారత సైన్యం ధ్వంసం చేసినట్లు సమాచారం. ఇప్పటి వరక మొత్తంగా ఎనిమిది డ్రోన్లను నిర్వీర్యం చేసినట్లు సమాచారం. పంజాబ్‌లోని గుర్‌దాస్‌పుర్ జిల్లాలో రాత్రి 9 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు పూర్తిగా కరెంట్ నిలిపివేయాలని కేంద్రతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది.