దివ్యాంగ చిన్నారిని విమానంలోకి నిరాక‌రించిన ఇండిగో సిబ్బంది…

ఘ‌ట‌న‌పై స్పందించిన కేంద్ర మంత్రి సింధియా

న్యూఢిల్లీ (CLiC2NEWS): చిన్నారి భ‌య‌ప‌డుతుండ‌టంతో ఇండిగో సంస్థ విమానంలోకి రానివ్వ‌ని ఘ‌ట‌న రాంచీలో చోటుచేసుకుంది. చిన్నారి ఆందోళ‌న‌కు గురవుతుండ‌టంతోనే ప్ర‌యాణానికి నిరాక‌రించిన‌ట్లు విమానాయాన సంస్థ స్ప‌ష్టం చేసింది. ఈ విష‌యం కాస్తా సోష‌ల్ మీడియాలో వైరల్ కావ‌డంతో ఇండిగోపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి… కాగా ఈ ఘ‌ట‌న‌పై కేంద్ర పౌర‌విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

వివ‌రాల్లోకి వెళ్లే… గ‌త శ‌నివారం దివ్యాంగ చిన్నారితో క‌లిసి ఓ కుటుంబం రాంచీ విమానాశ్ర‌యానికి వ‌చ్చింది. భ‌యాందోళ‌న‌ల‌తో ఉన్నాడ‌ని ఆ చిన్నారి విమానం ఎక్కేందుకు ఇండిగో సిబ్బంది నిరాక‌రించారు. దాని వ‌ల్ల ఇత‌ర ప్ర‌యాణికుల‌కు ఇబ్బంది క‌లుగుతుంద‌నే కార‌ణంతో చిన్నారిని సిబ్బంది విమానం ఎక్క‌నివ్వ‌లేదు. దీంతో త‌ల్లిదండ్రులు కూడా త‌మ ప్ర‌యాణాన్ని విర‌మించుకున్నారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాల‌ను మ‌నీషా గుప్తా అనే ప్ర‌యాణికురాలు త‌న ఫేస్‌బుక్ ఖాతాలో పోస్టు చేశారు. ఇది చాలా అమాన‌వీయ ఘ‌ట‌న అని త‌న సోష‌ల్ మీడియాలో రాసుకొచ్చారు. దాంతో ఈ విష‌యం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. నెట్టింట్ల ప‌లువురు ఇండిగో పై విమ‌ర్శ‌లు గుప్పించారు.
ఈ ఘ‌ట‌న‌పై విమాన‌యాన సంస్థ స్పందించింది. “భ‌యంతో ఉన్న ఆచిన్నారి స్తిమిత‌ప‌డితే విమానం ఎక్కించ‌డానికి చివ‌రి వ‌ర‌కూ గ్రౌండ్ సిబ్బంది చూశార‌ని.. కానీ ఫ‌లితం లేక‌పోయింది“ అని వివ‌ర‌ణ ఇచ్చింది.

కాగా ఆ కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వ‌స‌తి సౌక‌ర్యం క‌ల్పించిన‌ట్లు.. త‌ర్వాత మ‌రుస‌టి రోజు ఆదివారం వారు మ‌రో విమానంలో త‌మ గమ్య‌స్థానానికి చేరిన‌ట్లు తెలిపింది.

ఘ‌ట‌న‌పై స్పందించిన కేంద్ర మంత్రి సింధియా
నెట్టింట్లో హ‌ల్‌చ‌ల్ కావ‌డంతో.. త‌న దృష్టికి వ‌చ్చిన ఈ ఘ‌ట‌న‌పై కేంద్ర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. “దీనిపై నేనే స్వ‌యంగా ద‌ర్యాప్తు చేప‌డ‌తాను.. ఇలాంటి ప్ర‌వ‌ర్త‌న‌ను ఎన్న‌టికి స‌హించేది లేదు.. బాధ్యుల‌పై త‌ప్ప‌కుండా త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటాం“ అని కేంద్ర మంత్రి ట్వీట్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.