IMLD: మాతృభాషే.. మన భాష కావాలి!

మాతృమూర్తికి ప్రణమిల్లుతూ
మాతృదేవోభవ అని కీర్తిస్తూ…
అమ్మ ఒడిలో నేర్చిన మన తెలుగు భాష
పలికే ప్రతిపలుకు అమృత గుళికలే…

సంస్కృతీ, సాంప్రదాయాలను
తిలోదకాలిస్తూ పరభాషా వ్యామోహంలో
మాతృభాషను దూరం చేస్తూ..
మన విలువలు మనమే కోల్పుతున్నాం కదా,

ఆంగ్లభాష వ్యామోహంలో
మాండలీక పదజాల ఉచ్చారణా మాధుర్యాన్ని
ఆస్వాదించలేక, మాతృభాషను కించపరిచే
దౌర్భాగ్య స్థితిలోకి దిగజారుతున్నాం…!

ఎండమావిలా ఆకర్షించే పరభాష వ్యామోహంలో
తెలుగు పదాల నుడికారాలు, అలంకార ఛందస్సుతో
హృదయ వీణలు మీటే పద్యాల అర్థాలకు తిలోదకాలిస్తున్నాం.

అంకుల్, ఆంటీ అనే పిలుపులతో
మాతృదేవోభవ, పితృదేవోభవ ,అని చెప్పే
మాతృభాషను కనుమరుగు చేస్తున్నాం..!
ధన వ్యామోహంతో విదేశాల్లో ఉద్యోగాల వేటలో
మాతృభాషను “ఆప్షన్”లా వాడేస్తున్నాం.

ఎంత ఎదిగినా ,
ఏ దేశంలో నివశిస్తున్నా!సంపాదన ఎంతైనా
“దేశం భాషలందు తెలుగు లెస్స “అని కీర్తించిన
రాయలవారి మాట.
మన మాటగా విశ్వమంతా ప్రతిధ్వనించాలి..

మాతృభాషను కాపాడుకోవడం మన కర్తవ్యం.
మనుగడ కోసం ఇతర భాషలను నేర్చుకో తప్పులేదు. మాతృభాషపై మమకారం చంపుకోవడం తప్పు.
అమ్మా!అనే పిలుపులోని భాగ్యదక్కించుకో
మమ్మీ అని పిలుస్తూ అమ్మను దూరం చేసుకోకు.

మానవ సంబంధాలను గౌరవిద్దాం.
మన భాషను మనమే కాపాడుకుందాం.
మన ఉనికి మన భాషే అని చాటుకుందాం.
అందరికీ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ(Feb21) శుభాకాంక్షలు మనసారా తెలుపుకుందాం.

-మంజుల పత్తిపాటి

ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్

మంజుల పత్తిపాటి
(ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ )
Leave A Reply

Your email address will not be published.