ముఖ్యమంత్రి కెసిఆర్ టిఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు: ఎల్ రమణ

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ టిడిపి అధ్యక్షుడు ఎల్.రమణ పార్టీ మార్పు వ్యవహారం కొలిక్కి వచ్చింది. ప్రగతి భవన్‌లో గురువారం రాత్రి రమణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి సీఎంతో సమావేశం అయ్యారు. అనంతరం రమణ మీడియాతో మాట్లాడుతూ.. సమావేశంలో వివిధ అంశాలు చర్చకు వచ్చాయని తెలిపారు. రాష్ట్రాల ఏర్పడిన తర్వాత రాజకీయ పరిణామాలపై చర్చ జరిగిందన్నారు. సామాజిక తెలంగాణ కోసం ముందుకు వెళ్లాలన్న ఆలోచనను కేసీఆర్ చెప్పారని, ఇందుకు తనతో కలిసి రావాలని కోరుతూ.. టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారని రమణ అన్నారు.
అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ..
రమణ అంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అభిమానమన్నారు. చేనేత కుటుంబ నుంచి వచ్చిన రమణ టీఆర్‌ఎస్‌కు అవసరమన్నారు. చేనేత వర్గాలకు ప్రభుత్వం ఎంతో చేసిందని, ఇంకా చేయాల్సి ఉందన్నారు. రమణను టీఆర్‌ఎస్‌లోకి సీఎం ఆహ్వానించారని, ఇందుకు రమణ సానుకూలంగా స్పందించారన్నారు. రమణ, తాను ఒకరికొకరం శ్రేయోభిలాషులమని, టీడీపీ తెలంగాణలో నిలబడే పరిస్థితి లేదని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.
త్వరలో ఎమ్మల్యేల కోటాలో ఆరు, గవర్నర్ కోటాలో ఒక ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే రమణకు టిఆర్ ఎస్ ఎమ్మల్సీ పదవి ఆఫర్ చేసినట్లు సమాచారం.