అవసరం
ప్రేమలు పెనవేసుకుని,
కలిసి తిరిగే కాలం కాదిది
కొత్త రుగ్మతల చొరబాటుతో
అనుబంధాలకు పడింది కళ్లెం
తక్షణావసరాలు తీర్చే వారి కోసమే ఆరాటాలు
వానితో పని అవుతుందనుకుంటే
చిరునవ్వులు చిందిస్తారు, ప్రేమలు ఒలకబోస్తారు
అప్యాయతలు, అనురాగాలు, బంధుత్వాల బంధం
పెందరాళ్లే ప్రదక్షణాలు, అర్జిలతో హాజరు
రాకపోకలు పెరుగుతాయి, కాల్స్‌తో కట్టిపడేస్తారు,
మెరమెచ్చు మాటలు, కపటోపాయాలు,
తేనెలొలికే తియ్యటి మాటలు
అన్యోనత నాటకాలు. అహ్వానాలు
వద్దన్నా విందు భోజనాలు
అవసరం తీరిందా… వాడేవడో, వీడెవడో
ఇగో రాజ్యమేలుతుంది
కొట్టుకు పోతుంది కృతజ్ఞతా భావం
కనిపించినా ఆమడ దూరం
అన్‌లిమిటెడ్ కాల్స్ ఉన్నా ఫోన్ రాదు చేతిలోకి
లోకం రీతి ఇదే నేటి నీతి
మార్పు రావాలని మనస్సు ఆరాట పడుతుంది.
-కోనేటి రంగయ్య
సీనియర్ పాత్రికేయులు