తలను తిరగి అతికించిన ఇజ్రాయెల్ వైద్యులు..

జెరూసలెం (CLiC2NEWS): అందుకేనేమో డాక్టర్లను దేవుళ్లతో పోలుస్తారు..! మెడ భాగంలో తీవ్ర గాయాలై, తల దాదాపు శరీరం నుండి వేరైన పరిస్థితిలో ఉన్న బాలుడికి తిరిగి పునర్జన్మ ప్రసాదించారు వైద్యులు. ఈ ఘటన జెరూసలెంలో చోటుచేసుకుంది. హదస్సా ఈన్ కెరెమ్ ఆసుపత్రి వైద్యులు ఈ కేసును ఓ సవాలుగా స్వీకరించి.. ఆ బాలుడికి వైద్యం అందించారు. ఎంతో క్లిష్టమైన ఈ ఆపరేషన్‌కు ఆస్పత్రిలోని అన్ని విభాగాల్లో పనిచేస్తున్న స్పెషలిస్ట్ వైద్యులతో పాటు నర్సులు కొన్ని గంటలపాటు ఎంతో శ్రమించారు. ఆపరేషన్ సమయంలో వైద్యుల సాంకేతిక పరిజ్ఞానం ఎంతో తోడ్పడిందని.. మా ప్రయత్నం వృథా కాలేదని ఆస్పత్రి ఆర్థోపెడిక్ సర్జన్ డా. ఓహాద్ ఈనావ్ తెలిపారు.
జోర్డాన్ వ్యాలికి చెందిన సులేమాన్ అనే పన్నెండేళ్ల బాలుడు సైకిల్ రైడ్ చేస్తూ ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో బాలుడి తల, మెడ కలిసే చోటులో బలమైన గాయమైందది. అక్కడ లిగమెంట్లు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇంకా పొత్తికడుపులో కూడా తీవ్రంగా గాయం అయినట్లు వైద్యులు గుర్తించారు. బాలుడి తల్లి దండ్రులు తమ కొడుకు పరిస్థితి చూసి.. తిరిగి బతికే అవకాశం లేదనే అనుకున్నారు. కానీ వైద్యుల తమ వంతు ప్రయత్నం చేస్తామనడంతో.. వారిలో చిరు ఆశ మొదలైంది.
నెల రోజుల క్రితం బాలుడికి శస్త్రచికిత్స నిర్వహించగా.. ప్రస్తుతం అతని కోలుకోవడంతో వైద్యులు డిశ్ఛార్జి చేశారు. ఒక్కగానొక్క కొడుకుని బతికించిన వైద్యులకు జీవితాంతం రుణపడి ఉంటామని తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలియజేశారు.