TS: భూముల విలువ పెంచుతూ ఉత్తర్వులు జారీ
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులు, భూముల విలువలు, రిజిస్ట్రేషన్ రుసుములు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పెంచిన విలువలు ఈ నెల 22 నుంచి అమలులోకి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్‌ను సిఎస్ ఆదేశించారు.
వ్యవసాయేతర భూముల విలువను ఇప్పటి కన్నా గరిష్టంగా 50 శాతం పెంచాలని రిజిస్ట్రేషన్‌శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ క్రమంలో సాగు భూములు గరిష్ట, కనిష్ట విలువల్లో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. భూముల మర్కెట్ విలువ హెచ్చింపుతో పాటు, రిజిస్ట్రేషన్ సంబంధిత 20 రకాల సేవలపై విధించే ఛార్జీలను కూడా పెంచనున్నారు.
వ్యవసాయేతర భూముల పెరుగుదల ప్రాంతాల వారీగా వాటి విలువ ఆధారంగా 20 శాతం, 30 శాతం, 40 శాతం మేర పెరుగనున్నాయి. ఈ నేపథ్యంలో పాత ధరల్లో రిజిస్ట్రేషన్లకు ఇంకా ఒక్క రోజే మిగిలి ఉండడంతో భూముల క్రయ విక్రయాల నిమిత్తం జనాలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు పోటెత్తారు.