మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చి దిద్దాలి
గంజాయిపై ఉక్కుపాదం మోపాలి : ముఖ్యమంత్రి కెసిఆర్
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో గంజాయి అక్రమ సాగు, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని సిఎం కెసిఆర్ పోలీస్, ఎక్సైజ్ శాఖల అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా అరికట్టేందుకు పటిష్టమైన వ్యూహాన్ని రూపొందించేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ బుధవారం ప్రగతిభవన్‌లో సంబంధిత అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో గంజాయి వినియోగం క్రమక్రమంగా పెరుగుతోందని వస్తున్న వార్తల నేపథ్యంలో గంజాయి మీద తీవ్ర యుద్ధాన్ని ప్రకటించాల్సిన అవసరం ఉందని సిఎం పేర్కొన్నారు. పరిస్థితి మరింత తీవ్రతరం కాకముందే పూర్తిగా అప్రమత్తం కావాలని, ఉన్నతస్థాయి సమావేశంలో విస్తృతంగా చర్చించి గంజాయి ఉత్పత్తిని సమూలంగా నిర్మూలించడానికి సమగ్ర ప్రణాళికను సిద్ధం చేయాలని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో గంజాయి పీడను తొందరగా తొలగించకపోతే మనం సాధిస్తున్న విజయాలు వాటి ఫలితాలు నిర్వీర్యమైపోయే ప్రమాదం వుంది అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గంజాయి కట్టడికి డిజి స్థాయి అధికారిని నియమించాలి. గంజాయి నియంత్రణకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలి. ప్రమాద ఘంటికలు మోగుతున్నాయనే విషయాన్ని పోలీస్, ఎక్సైజ్ శాఖాధికారులు తీవ్రంగా పరిగణించాలి. ఎంతో ఆవేదనతో నేను ఈరోజు ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశాను. పెడతోవ పట్టిన యువత గంజాయి గ్రూపులుగా ఏర్పడి వాట్సాప్ ద్వారా మేసేజ్‌లు అందజేసుకుని గంజాయి సేవిస్తున్నారని నివేదికలు వస్తున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అమాయకులైన యువకులు తెలిసీ తెలియక గంజాయి బారిన పడుతున్నారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల యువత మానసిక వ్యవస్థ దెబ్బతిని ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం వుంటుంది. డి అడిక్షన్ చాలా క్లిష్టమైన, సుదీర్ఘమైన ప్రక్రియ. దీన్ని నిరోధించడానికి మీకేం కావాలన్నా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా వుంది. గంజాయి మాఫీయాను అణిచివేయాలి, నేరస్థులు ఎంతటివారైనా ఉపేక్షించవలసిన అవసరం లేదు“ అని ముఖ్యమంత్రి తెలిపారు.
అలాగే “ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను, ఫ్లయింగ్ స్క్వాడ్స్ ను బలోపేతం చేయాలని ఎక్సైజ్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్‌ను సిఎం ఆదేశించారు. విద్యా సంస్థల దగ్గర ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు. సరిహద్దుల్లో చెక్ పోస్టుల సంఖ్యను పెంచాలన్నారు. సమాచార వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు తగినన్ని వాహనాలను ఏర్పాటు చేయాలన్నారు. ఇంటలిజెన్స్ శాఖలో కూడా ఇందుకోసం ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పాలని చెప్పారు. గంజాయి నిర్మూలనలో ఫలితాలు సాధించిన అధికారులకు క్యాష్ రివార్డులు, ప్రత్యేక ప్రమోషన్లు, మొదలైన ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందిస్తుందని“ ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
రాష్ట్రంలో గుడుంబా, గ్యాంబ్లింగ్ తిరిగి తలెత్తుతున్నాయి. గతంలో పేకాట నిషేధం అమలయిన తీరుపై రాష్ట్రంలోని మహిళలంతా ప్రభుత్వాన్ని ప్రశంసించారు. తిరిగి ఈ రుగ్మత సమాజంలో తలెత్తకుండా కఠిన చర్యలు తీసుకోండి. పేకాట ఆగిపోవాలి. రాష్ట్ర ప్రతిష్టను కాపాడే విధంగా ఎక్సైజ్, పోలీస్ శాఖలు ఉమ్మడిగా పనిచేసి గంజాయి విత్తనాలు కూడా కనిపించనంత కట్టుదిట్టంగా పనిచేయాలి. మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలి అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి కడియం శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, సిఎస్‌సోమేశ్ కుమార్, హోం శాఖ సలహాదారు అనురాగ్ శర్మ, డీజీపీ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.