జగిత్యాల.. వస్త్రం కడుపులోనే ఉంచి కుట్లు…!
జగిత్యాల ప్రాంతీయ దవాఖానాలో డాక్లర్ల నిర్వాకం?
జగిత్యాల (CLiC2NEWS): పురిటినొప్పులతో కాన్పుకోసం వచ్చిన మహిళకు శస్త్ర చికిత్స చేసి కడుపులో వస్త్రం (రక్తం తుడిచేందుకు వాడే మాప్)ను ఉంచిన ఉదంతం జగిత్యాల ప్రాంతీయ దవాఖానాలో చోటుచేసుకుంది. ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘోర ఘటన జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నమిలి గ్రామానికి చెందిన నవ్యశ్రీ ప్రసవం కోసం 2021 డిసెంబర్ 29వ తేదీన ఆసుపత్రిలో చేరింది. జగిత్యాల ప్రాంతీయ దవాఖానా వైద్యలు ఆమెకు ఆపరేషన్ చేసి బిడ్డకు పురుడు పోశారు.
ఈ క్రమంలో కొన్ని రోజులు గడిచిన తర్వాత కడుపునొప్పి.. తదితర సమస్యలు ఎదుర్కొంది. దీనికోసం ఎంత మంది వైద్యులకు చూపించినా.. ఎన్ని మందులు వాడినా.. సమస్య తీరలేదు..
ఈ క్రమంలో వేముల వాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి వైద్యులను సంప్రదించడంతో.. స్కానింగ్ తదితర పరీక్షలు నిర్వహించడంతో.. కడుపులో వస్త్రం లాంటి.. పదార్థం ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు.. అనంతరం ఆమెకు శస్త్ర చికిత్స చేసి ఆ వస్త్రం (రక్తం తుడిచేందుకు వాడే మాప్)ను తొలగించారు.
ఈ ఉదంతం జిల్లా కలెక్టర్ దృష్టికి రావడంతో దీనిపై నివేదిక ఇవ్వాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. దాంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కాగా ఓ పిజి వైద్య విద్యార్థి … ప్రసవం కోసం వచ్చిన నవ్యశ్రీని ఆపరేషన్ చేసినట్లు జగిత్యాల ఆసుపత్రి వైద్యులు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం.