న‌ల్లా బిల్లులు వ‌సూళ్ల‌పై దృష్టి సారించాల‌న్న జ‌ల‌మండ‌లి ఎండి

హైద‌రాబాద్ (CLiC2NEWS): న‌గ‌రంలో సంవ‌త్స‌ర కాలం, ఆపై నుండి న‌ల్లా బిల్లులు చెల్లించని నాన్ డొమెస్టిక్, నాన్ ఫ్రీ వాటర్ కనెక్షన్ల బకాయిలను వసూలు చేయాలని మంచినీటి స‌ర‌ఫ‌రా మండ‌లి ఎండి దానం కిషోర్ అధికారులను ఆదేశించారు. ఎవ‌రైనా బిల్లు చెల్లించ‌క పోతే వారి క‌నెక్ష‌న్ తొల‌గించాల‌న్నారు. ఖైరతాబాద్ ప్రధాన కార్యాలయంలో గురువారం జలమండలి ఓ అండ్ ఎం, రెవెన్యూ, ఎంసీసీ, సింగిల్ విండో తదితర అంశాలపైన అధికారులతో సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎంసీసీకి వచ్చే ఫిర్యాదులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని పేర్కొన్నారు. ముఖ్యంగా కలుషిత నీరు, సీవరేజి ఓవర్ ఫ్లో, మిస్సింగ్ మ్యాన్ హోళ్ల‌పై వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యమివ్వాల‌న్నారు.

దీర్ఘ కాలికంగా బకాయిలు చెల్లించడంలో మొండికేస్తున్న వారికి నోటీసులు జారీ చేయాల‌న్నారు. స్పందించ‌ని ప‌క్షంలో వారి కనెక్షన్ తొలగించాలని స్పష్టం చేశారు. అయితే డొమెస్టిక్ స్లమ్ వినియోగదారులను బిల్లు చెల్లింపు కోసం ఒత్తిడి చేయకూడదని సూచించారు. కొత్త క‌నెక్షన్‌ల కోసం వ‌చ్చిన ద‌ర‌ఖాస్తుల‌ను ప‌రిశీలించి వెంట‌నే మంజూరు చేయ‌డానికి త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. ఈ కార్యక్రమంలో ఈఎన్‌సి, ఆపరేషన్ డైరెక్టర్ అజ్మీరా కృష్ణ, రెవెన్యూ డైరెక్టర్ విఎల్ ప్రవీణ్ కుమార్, ఆపరేషన్ డైరెక్టర్-2 స్వామి, సీజీఎంలు, జీఎంలు, డిజిఎంలు, మేనేజర్లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.