వానాకాలం నేపథ్యంలో జలమండలి మాన్‌సూన్ సేఫ్టీ వాక్
భద్రతా వారోత్సవాలు జూన్ 5 వరకు పొడిగింపు
హైదరాబాద్ (CLiC2NEWS): జలమండలి నిర్వహిస్తున్న భద్రతా వారోత్సవాలను జూన్ 5వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఎండీ దానకిశోర్ తెలిపారు. వానాకాలం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో భద్రతా వారోత్సవాల్లో భాగంగా ప్రజల భద్రత కోసం పటిష్ఠ చర్యలు తీసుకోవడానికి, అవగాహన కల్పించడానికి మాన్‌సూన్ సేఫ్టీ వాక్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.గురువారం ఆయన జలమండలి ఈడీ, డైరెక్టర్లు, సీజీఎంలు, జీఎంలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వానాకాలం నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వ సూచనల మేరకు సేఫ్టీ ఆడిట్ ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ ఓ ఆండ్ ఎం సెక్షన్‌లో మేనేజర్ నేతృత్వంలో ఒక బృందంగా ఏర్పడి ఆ సెక్షన్ పరిధిలో మొత్తం పర్యటించాలని పేర్కొన్నారు.
వరద నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి సూచిక బోర్డులను, ఎర్ర జెండాలని ఏర్పాటుచేయాలని పేర్కొన్నారు. పనులు చేపట్టిన ప్రదేశాల్లో శిథిలాలను, మ్యాన్‌హోళ్ల నుంచి తీసిన పూడికను వెంటనే తొలగించాలని పేర్కొన్నారు. సెక్షన్ కార్యాలయాల్లో సేఫ్టీ కిట్లు నిత్యం అందుబాటులో ఉండాలని ఆదేశించారు. పైప్‌లైన్ విస్తరణ పనులు చేపట్టిన ప్రాంతాల్లో రోడ్డు పునరుద్ధరించాలని సూచించారు. జూన్ 4వ తేదీ నాటికి అన్ని సెక్షన్‌లో సమగ్రంగా సేఫ్టీ ఆడిట్ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఓఆర్ఆర్ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని ఓఆర్ఆర్ పరిధిలోని అధికారులను ఆదేశించారు.