జీవామృతం తయారీ విధానం..
జీవామృతంతో చెట్లకు పట్టే పురుగులకు చెక్

ప్రియమైన భారతదేశ ప్రజల్లారా మనదేశ ప్రజలందరికి సమగ్ర పౌష్టికాహారాన్ని, పుష్కలంగా అందించేగలిగేది ప్రకృతి వ్యవసాయం మాత్రమే. ప్రకృతి వ్యవసాయం చేయటం వలన ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాకుండా మన ఇంటి వద్ద వున్న తక్కువ ప్రదేశంలో లేదా ఇంటి మిద్ద పైన కూడా మనకు కావాల్సిన ఆకుకూరలు, కూరగాయలు, తీగజాతి చెట్లు వేసుకొని చక్కగా వాటిని నుండి వచ్చే బెండకాయ, కాకరకాయ, సొరకాయ, బీరకాయ, దొండకాయ, గోరుచిక్కుళ్లు, చిక్కుడుకాయలు, పాలకూర, మెంతికూర, చుక్క కూర, గోంగూర, గంగవయాలి, మునగ చెట్టు ఆకులు సహజ సిద్ధంగా ఆహారంగా తయారుచేసుకొని తినవచ్చును.
జీవామృతం వాడుతూ చెట్లకు పురుగులు పట్టకుండా… చక్కగా ఏపుగా పెరగటానికి ఉపయోగపడుతుంది. వీటిని సేంద్రియ పద్ధతిలో పండించుకుంటూ ఆరోగ్యవంతమైన జీవనం గడపవచ్చును.
జీవామృతం తయారు చేయు విధానం.
కావాల్సిన పదార్దాలు..
1) పదిరోజుల లోపు వున్న తాజా అవు పేడ 2 కేజీలు
2) గోమూత్రం 2 లీటర్లు
3) ఉత్తమమైన బెల్లం 1/2 కేజీ.
4) ఏదైనా శనగ, లేదా పెసర పిండి 1/2 కేజీ.
5) మగ్గిన అరటి పండ్లు 4
6) చెట్ల కింద వున్న మట్టి 3గుప్పిట్లు
7) నీరు 35 లీటర్లు
8) ఒక 50 లీటర్ల డ్రమ్ము
తయారుచేయువిధానం
తురుముకున్న బెల్లం, పేడ, పప్పుల పిండి, మట్టి అరటిపండ్లు గుజ్జు, డ్రమ్ములో వేసి చేతితో బాగా పిసికి బాగా కలపాలి. తరువాత గోమూత్రం, కూడా దానిలో వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని 50 లీటర్ల డ్రమ్ములో వేయాలి మరియు దానిలో 35 లీటర్లు నీరు కూడా వేసి బాగా కలపాలి. దీన్ని నీడలో ఉంచాలి. దీనిని ప్రతిరోజు ఒక వేప కట్టేతో ఉదయం /సాయంత్రం 10 నిమిషాలు కుడివైపు తిప్పుతూ కలపాలి. 5 వ రోజు నుండి దీనిని చక్కగా వాడుకోవచ్చును.
వాడేవిధానం.
8-10 రోజుల్లోగా జీవామృతాన్ని 1:10 నిష్పతిలో మొక్కలు చెట్ల పొదలలో వేయవచ్చును. లేదా పిచకారి చేయవచ్చును.
-షేక్. బహార్ అలీ.
ఆయుర్వేద వైద్యుడు