భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ ప్రమాణం..

ఢిల్లీ (CLiC2NEWS): సుప్రీంకోర్టు సిజెఐగా జస్టిస్ డి వై చంద్రచూడ్ రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణస్వీకారం చేశారు. భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ఆయన రెండేళ్లపాటు భారత ప్రధాన న్యాయమూర్తి పదవీ బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈయన తండ్రి జస్టిస్ యశ్వంత్ విష్ణు చంద్రచూడ్ కూడా సిజెఐగా సుదీర్ఘకాలం సేవలందించారు. ఇపుడు తనయుడు భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా అత్యున్నత పీఠాన్ని అధిరోహించటం విశేషం. జస్టిస్ డి వై చంద్రచూడ్ 2016లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. దీనికంటే ముందు అలహాబాద్, ముంబయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.