హైకోర్టు ఇన్‌ఛార్జి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ ఎంఎస్ రామ‌చంద్రరావు నియామ‌కం అయ్యారు. అత్యంత సీనియ‌ర్ న్యాయ‌మూర్తి జ‌స్టిస్ రామ‌చంద్ర‌రావుకు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఈ మేర‌కు రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. జస్టిస్ హిమాకోహ్లీ రిలీవ్ కాగానే జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు బాధ్యతలు చేపట్టాలని పేర్కొంటూ కేంద్ర న్యాయశాఖ గెజిట్ విడుదల చేసింది.

హైదరాబాద్​లో పుట్టి పెరిగిన జస్టిస్ ఎమ్మెస్సార్

జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, భారత లా కమిషన్ మాజీ ఛైర్మన్ జస్టిస్ ఎం.జగన్నాథరావు కుమారుడు. హైదరాబాద్​లో పుట్టి పెరిగిన జస్టిస్ ఎమ్మెస్సార్ ఉస్మానియా వర్సిటీలో 1989లో ఎల్ఎల్​బీ, కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ఎల్ఎల్ఎం చదివారు. న్యాయవాదిగా 1989 సెప్టెంబరు 7న పేరు నమోదు చేసుకున్న జస్టిస్ రామచంద్రరావు ఐఆర్​డీఏ, ఎస్​బీఐ, ఎస్​బీహెచ్, డీసీసీబీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, రాష్ట్ర ఆర్థిక సంస్థ, ఐపీఈ, సెబీ, తదితర సంస్థలకు న్యాయవాదిగా చేశారు. ఉమ్మడి ఏపీ ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాదిగా కూడా పనిచేశారు. న్యాయవాదిగా పలు సివిల్, కంపెనీ, పరిపాలన, ఆర్బిట్రేషన్ కేసులను వాదించారు. ఉమ్మడి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా 2012 జూన్ 29న నియమితులైన జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు… 2013 డిసెంబరు 4 నుంచి న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లీ సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందిన నేపథ్యంలో హైకోర్టు జడ్జిలు శుక్రవారం ఆమెకు వీడ్కోలు ప‌లికారు. వర్చువల్‌ విధానంలో ఈ కార్యక్రమం జరిగింది. తెలంగాణ హైకోర్టు మొట్టమొదటి మహిళా చీఫ్‌ జస్టిస్‌గా హిమా కోహ్లీ ఈ ఏడాది జనవరి 7న నియమితులైనారు. సెప్టెంబర్‌ 1న పదవీ విరమణ చేయనున్న సందర్భంలోనే ఆమెకు సుప్రీం జడ్జిగా పదోన్నతి లభించడం విశేషం. దీంతో మరో మూడేళ్ల పాటు హిమా కోహ్లీ జడ్జిగా పనిచేసే అవకాశం లభించింది.

Leave A Reply

Your email address will not be published.