కళాతపస్వి విశ్వనాథ్ కన్నుమూత

హైదరాబాద్ (CLiC2NEWS): తెలుగు దర్శకుడు, కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్ (92) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న విశ్వనాథ్ గురువారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను అపోలో ఆసుపత్రికి తరలించారు. కాగా అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా (గుంటూరు జిల్లా) రేపల్లెలో కాశీనాథుని సుబ్రహ్మణ్యం, సరస్వతి దంపతులకు 1930 ఫిబ్రవరి 19న విశ్వనాథ్ జన్మించారు. గుంటూరులోని హిందు కళాశాలలో ఇంటర్మీడియట్, ఆంధ్రా క్రిస్టియన్ కళాశాలలో బిఎస్సీ పూర్తి చేశారు. విశ్వనాథ్ తండ్రి చెన్నైలోని విజయవాహినీ స్టూడియోలో పని చేసేవారు.. విశ్వనాథ్ డిగ్రీ పూర్తవ్వగానే విజయవాహినీ స్టూడియోలో సౌండ్ రికార్డిస్ట్‌గా సినీ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఆదూర్తి సుబ్బారావు దగ్గర అసోసియేట్‌గా చేరారు. ఆ తర్వాత 1965లో ఆత్మ గౌరవం సినిమాకు దర్శకుడిగా పరిచయం అయ్యారు. తొలిసినిమాకే నంది అవార్డును సొంతం చేసుకున్నారు. అ తర్వాత తెలుగు సినీ ప్రయాణంలో ఎన్నో ఆణిముత్యాలను నిర్మించారు. శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం, సిరిసిరి మువ్వ, శ్రుతిలయలు, సిరివెన్నెల, ఆపద్బాంధవుడు, ఇలా.. అనేక సూపర్ హిట్ చిత్రాలను తెలుగు సినీఅభిమానులకు అందించారు.
విశ్వనాథ్ కు 1992లో పద్మశ్రీ, 2017లో దాదాసాహెబ్ ఫాల్కె అవార్డులు వచ్చాయి.