కొత్తవారిని పరిచయం చేసే.. ఆప్త మిత్రుడు టీ..!

కొత్తవారిని పరిచయం చేసే మన ఆప్త మిత్రుడు టీ..!
బాధతో సతమతమౌతుంటే అమ్మ చేతి స్పర్శలా తాకి
గుప్పెడంత గుండెకు ఉపశమనం కలిగించే ఆప్త మిత్రుడు టీ..!
మౌనంలోన దాగి ఉన్న మాటను
బయటకు రప్పిస్తున్నది మన ఆప్త మిత్రుడు టీ..!
నిండు పున్నమి వెన్నెల రేయిలో సన్నగ వీచే చల్లగాలి లో
మరుగున పడిన జ్ఞాపకాల మడతలను గుర్తుకు తెస్తుంది మన ఆప్త మిత్రుడు టీ..!
బాధలో అయినా సరే ఆనందంలో అయినా సరే
వెచ్చగా అధరాలను ముద్దాడి ఒంటరి కాదు నేను ఉన్నాను
అని గుర్తు చేస్తుంది మన ఆప్త మిత్రుడు టీ..!
ప్రతి విద్యార్థి కనురెప్పల మాటున దాగిన నిద్రను దూరం చేసి
చదువుల్లో సహకరిస్తున్నది మన ఆప్త మిత్రుడు టీ..!
సైనికులు కాశ్మీర కంబళి లేక చలికి ఉక్కిరిబిక్కిరై పోతుంటే
ఆపద్బాంధవుడిలా నేను ఉన్నాను అంటూ వేడిని అందిస్తుంది మన ఆప్త మిత్రుడు టీ..!
పర్వతాల నుండి వీచే సాయంకాల మలయమారుతం ఆహ్లాదం కలిగిస్తూ
సముద్రుడి తుంపర జల్లు వర్షంలో తడుస్తూ ఉంటే
మనసు అనే ముత్యపు చిప్పలో దాగిన మధుర జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది మన ఆప్త మిత్రుడు టీ..!
–మంజుల పత్తిపాటి