ఐడీటీఆర్ కు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రారంభోత్సవం
రాజన్న సిరిసిల్ల (CLiC2NEWS): జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ (ఐడీటీఆర్)ను తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రారంభించారు. సిరిసిల్ల జిల్లా పర్యటనలో ఆదివారం సిఎం పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా తొలుత తంగళ్లపల్లి మండలం మండేపల్లి వద్ద డబుల్ బెడ్రూం ఇండ్లకు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం లబ్ధిదారులు ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఇక్కడ గేటెడ్ కమ్యునిటి తరహాలో రూ. 83.37 కోట్లతో 27 ఎకరాల్లో మొత్తం 1,320 రెండు పడక గదుల ఇళ్లను నిర్మించారు. లబ్ధిదారుల గృహప్రవేశ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు.

ఆ తర్వాత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్‌కు చేరుకొని మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్‌కుమార్‌కుమార్‌తో కలిసి సిఎం కెసిఆర్ ప్రారంభించారు. తరువాత భవనంలో తరగతి గదులను పరిశీలించారు. 20 ఎకరాల స్థలంలో రూ. 16. 48 కోట్లతో ఈ ఐడిటిఆర్ ను నిర్మించారు. ఈ కేంద్రంలో 400 మందికి పైగా శిక్షణ ఇచ్చేలా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్‌కుమార్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, కరీంనగర్ ఉమ్మడి జిల్లా నేతలతో పాటు పలువురు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
