ప్రధాని మోడీకి కెసిఆర్ లేఖ..బొగ్గు గనుల వేలం నిలిపివేయాలని విజ్ఞప్తి

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ సింగరేణిలో తలపెట్టిన నాలుగు బొగ్గు గనుల వేలం నిలిపివేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ప్రతి ఏటా 65 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కార్ణాటక, తమిలనాడులోని థర్మల్ పవర్ స్టేషన్‌ల బొగ్గు అవసరాలను తీర్చడంలో సింగరేణి కీలక పాత్ర పోషిస్తోందని లేఖలో సిఎం రాశారు. బొగ్గు గనుల వేలాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణిలోని అన్ని కార్మిక సంఘాలు గురువారం నుండి 3రోజుల పాటు సమ్మెకు పిలుపునిచ్చాయి. సింగరేణి బొగ్గు అవసరాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం అనేక మైనింగ్ లీజులు మంజూరు చేసిందని, దానకి కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 5,661 మెగావాట్లు నుండి13,688 మెగావాట్లు పెరిగిందని, విద్యుత్ ఉత్పత్తికి నిరంతరాయంగా బొగ్గు సరఫరా చేయడం కీలకమని, ఈనేపథ్యంలో కోల్ బ్లాక్స్ వేలాన్ని నిలిపివేసేలా కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖను ఆదేశించాల్సిందిగా సిఎం కెసిఆర్ ప్రధానమంత్రిని కోరారు.