దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉన్న తెలంగాణకు ఈ దుస్థితి ఏంటి?: కెసిఆర్

సూర్యాపేట (CLiC2NEWS): బిఆర్ ఎస్ అధినేత ఆదివారం జగగామ, సూర్యపేట జిల్లాల్లో ఎండిపోయిన పంటలను పరిశీలించారు. అనంతరం సూర్యపేటలో మీడియాతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ వంద రోజుల పాలనలో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని కెసిఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో రైతులు మళ్లీ ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి వస్తుందని అనుకోలేదని ఈ పరిస్తితి ఎందుకు వచ్చిందో అందరూ ఆలోచించాలన్నారు. దేశంలో నంబర్ వన్ స్థానంలో ఉన్న తెలంగాణకు స్వల్ప కాలంలోనే ఈ దుస్థితి రావడానికి కారణం ఏంటని ఆయన ప్రశ్నించారు. ప్రపంచమే మెచ్చిన మిషన్ భగీరథ నిర్వహణలో లోపాలెందుకు వస్తున్నాయని కెసిఆర్ ప్రశ్నించారు. మా హయాంలో ఏ ఆడబిడ్డ బిందెపట్టుకుని కనిపించలేదు. ఎక్కడా నీళ్ల ట్యాంకర్లు కూడా కనిపించలేదు.. ఇవాళ హైదరాబాద్‌లో నీళ్లు ట్యాంకర్ల ఎందుకు కనిపిస్తున్నాయన్నారు. అగ్రగామి రాష్ట్రానికి ఎందుకు చెదలు పట్టాయని కెసిఆర్ ప్రశ్నించారు.
అప్పట్లో కరెంట్ పోతే వార్త అని.. ఇప్పుడు కరెంట్ ఉంటే వార్త అయింది. ప్రస్తుత ప్రభుత్వ అసమర్ధత , అలసత్యం కారణంగానే ఈ దుస్థితి తెలెత్తింది. హైదరాబాద్‌ను పవర్ ఐలాండ్ సిటీగా మార్చాం.. రెప్పపాటు కూడా కరెంటు పోకుండా జాగ్రత్తలు తీసుకున్నామని కెసిఆర్ తెలిపారు. ప్రభుత్వం మారి నాలుగో నెల వరకూ నేను తెరిచి మాట్లాడలేదు.. చరిత్రలో ఏ సిఎం మాట్లాడనంత దురుసుగా మీరు మాట్లాడినా నేను నోరు మెదపలేడు. కానీ లక్షల ఎకరాలు ఎండుతుంటే చూస్తూ ఉండలేకపోయానన్నారు. రైతులకు చేతులెత్తి దండం పెట్టి చెబుతున్నా.. ఆత్మహత్యలు చేసుకోవద్దని కెసిఆర్ విజ్ఞప్తి చేశారు.