చేతకాదన్నారు.. చేసి చూపించాం: సిఎం కెసిఆర్
రాజన్న సిరిసిల్ల (CLiC2NEWS): తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కాకముందు తెలంగాణ వారికి ఏదీ చేతకాదని కొంత మంంది వాదించారు.. కానీ చిత్తశుద్ధి, వాక్‌శుద్ధి ఉంటే ఏదైనా సాధ్యమవుతుందని ఇవాళ నిరూపించామని తెలంగాణ సిఎం కె. చంద్రశేఖరరావు అన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆదివారం ముఖ్యమంత్రి కెసిఆర్ పర్యటించారు. ఈ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. సిరిసిల్లలో సకల సౌకర్యాలతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని, సర్దాపూర్‌లో మార్కెట్‌యార్డు, గిడ్డంగులను, సిరిసిల్లలో నర్సింగ్ కళాశాలను, మండేపల్లిలో ఐడీటీఆర్ శిక్షణ కేంద్రాన్ని సీఎం ప్రారంభించారు.
సిరిసిల్లలో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని కేసీఆర్ ప్రారంభించారు. సర్వమత ప్రార్థనలతో కలెక్టర్ కృష్ణభాస్కర్ కూర్చిలో ఆసీనులయ్యారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం పాల్గొని మాట్లాడుతూ..రైతు బీమా మాదిరే రాబోయే రెండు మూడు నెలల్లో చేనేత కార్మికులకు కూడా బీమా ప్రకటిస్తామన్నారు. కార్మికుడు చనిపోతే ఆ కుటుంబం బజారున పడకుండా, వాళ్లు ఏకదమ్ పరేషాన్ కాకుండా వాళ్లకొక ఆధారంగా ఉంటుందన్నారు. కొంత ఊరట ఇస్తుందన్నారు.
నూలు గానీ, రసాయనాలు గానీ, రంగులు గానీ 50 శాతం సబ్సిడీతో అందజేస్తున్నట్లు చెప్పారు. అందరి మొఖాల మీద చిరునవ్వులు వికసించే తెలంగాణ కావాలని ఆ దిశగా ముందుకు పురోగమిద్దామని సీఎం అన్నారు.
పరిపాలన సంస్కరణల్లో భాగంగా నూతన జిల్లాల ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపిన సీంఎ ఈ క్రమంలోనే రాజన్న సిరిసిల్ల జ్లిలా ఏర్పాటు కావడం జరిగిందన్నారు. జిల్లా పాలన వ్యవహారాలకు సంబంధించిన ముఖ్య కార్యాలయం కలెక్టరేట్ ఏర్పాటు కావడం చాలా సంతోషంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.