ఎపి ఉద్యోగులు తెలంగాణ ఆసుపత్రులలో చికిత్స చేయించుకోవచ్చు..
అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల ఆరోగ్య బీమా పథకం అమలుపై కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో డిఎంఇ గుర్తించిన ఆసుపత్రులలో ఎపి ప్రభుత్వ ఉద్యోగులు చికిత్స చేయించుకునేందుకు అనుమతినిచ్చింది. ఎపి, తెలంగాణ విభజన అనంతరం అనేక మంది ఎపి ఉద్యోగులు హైదరాబాద్‌లోనే సెటిల్ అయ్యారు. వీరు విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్ సంస్థల ఉద్యోగులు హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. తెలంగాణలో వైద్యం చేయించుకున్న పలువురు ఎపి ఉద్యోగులు, పింఛనర్లు.. బిల్లులు రీయింబర్స్ కాక నష్టపోయినట్లు సమాచారం. ఇప్పటి నుండి తెలంగాణ రాష్ట్రంలోని డిఎంఇ గుర్తించిన ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకునేందుకు ఎపి సర్కార్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు రిఫరల్ ఆస్పత్రులను గుర్తించాలని ఎన్‌టిఆర్ వైద్య సేవ సిఇఒను ప్రభుత్వం ఆదేశించింది.