ఒడిశాలోని బాలాసోర్‌లో 12 మంది పిల్లలకు కొవిడ్ పాజిటివ్..
భువనేశ్వర్ (CLiC2NEWS): దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కేరళలో రోజువారీ కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. దేశ వ్యాప్తంగా పాజిటివ్ కేసుల నమోదు సంఖ్య కూడా పెరుగుతోంది. కాగా కేరళతో పాటు ఒడిశాలో కూడా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో 12 మంది పిల్లలకు కరోనా సోకినట్లు జిల్లా వైద్యాధికారులు గురువారం వెల్లడించారు. వీరిలో నలుగురు నెలలోపు వయసున్న వారు కాగా, మిగతా వారిలో ముగ్గురు ఏడాది లోపు, మరో ముగ్గురు ఏడాది పైబడిన వారు ఉన్నారు. మరో ఇద్దరు చిన్నారులు కొవిడ్ నుంచి కోలుకుని బుధవారం డిశ్చార్జి అయ్యారు. నెలలోపు వయసున్న చిన్నారులు జిల్లా ఆస్పత్రిలోని సిక్ న్యూబార్న్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్నట్లు జిల్లా మెడికల్ అధికారి తెలిపారు.
గడిచిన 24 గంటల వ్యవధిలో ఒడిశాలో కొత్తగా 849 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
తాజా కేసులలో 18 ఏండ్ల లోపు ఉన్న వారు 130 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.