రాష్ట్రంలో కొవిడ్ పరీక్షలు పెంచాలి: హైకోర్టు
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. ఈ మేరకు కరోనా కేసులపై హైకోర్టులో విచారణ జరిగింది. కేసులు పెరుగుతుండటంతో పరీక్షలు పెంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. అనంతరం విచారణను జూన్ 22వ తేదీకి వాయిదా వేసింది.
రాష్ట్రంలో మంగళవారం 13,149 కొవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. 119 మందికి పాజిటివ్‌గా తేలింది. సోమవారం 65 కేసులు మాత్రమే వచ్చాయి. ప్రస్తుతం రాష్ట్రంలో క్రియాశీల కేసులు సంఖ్య 658కి చేరింది. క్రిందటి వారంతో పోల్చితే హైదరాబాద్‌లో కేసులు సంఖ్య గణనీయంగా పెరిగింది. మరోవైపు దేశంలో కూడా కొవిడ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా వేగంగా పెరుగుతూ 29వేలకు చేరువలో ఉన్నాయి.