లఖింపుర్ ఖేర్ ఘటనపై రిటైర్డ్ జడ్జితో విచారణ.. బాధిత కుటుంబాలకు రూ.45లక్షలు..
![](https://clic2news.com/wp-content/uploads/2021/10/UP-ACCIDENTp-kumar.jpg)
లక్నో (CLiC2NEWS): ఉత్తరప్రదేశ్‌లోని లఖింపుర్ ఖేర్‌లో ఆదివారం కేంద్ర మంత్రి కాన్వాయ్ కారు దూసుకెళ్లడం వల్ల నలుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జరిగిన ఘర్షణల్లో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అదే ఘటనతో లింకు ఉన్న ఓ జర్నలిస్టు ఇవాళ మృతిచెందారు. అయితే లఖింపుర్ ఖేర్ ఘటనలో మృతిచెందిన నలుగురు రైతు కుటుంబాలకు యూపీ ప్రభుత్వం ఒక్కొక్క మృతుడి కుటుంబానికి రూ.45 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించింది. లఖింపుర్ ఖేర్‌లో గాయపడ్డ వారికి ఒక్కొక్కరికి 10 లక్షలు ఇవ్వనున్నట్లు యూపీ సర్కార్ ప్రకటించింది.
ఈ ఘటనపై హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తితో విచారణ చేయించనున్నట్లు ఏడీజీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన నలుగురు రైతులకు రూ.45 లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ఆయన చెప్పారు. జిల్లాలో పర్యటించేందుకు రాజకీయ నేతలకు అనుమతి లేదని ప్రశాంత్ కుమార్ స్పష్టం చేశారు. హింసాత్మక ఘటనలపై రైతుల ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు చెప్పారు. ఈ ఘటనపై హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తితో విచారణ చేయించనున్నట్లు తెలిపారు.