వయనాడ్‌లో ప్రకృతి విలయం.. 291కి చేరిన మృతుల సంఖ్య
వయనాడ్ (CLiC2NEWS): కేరళలోని వయనాడ్ లో కొండచరియలు విరిగిపడటంతో కొన్ని ప్రాంతాలు ఆనవాళ్లు లేకుండాపోయినట్లు సమాచారం. ఆ ప్రకృతి విలయంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 291 చేరింది. మరో 200 మంది ఆచూకీ గల్లంతైనట్లు సమాచారం. ముండక్కై, చూరాల్ మల ప్రాంతాలలోని గృహాలు నేలమట్టమైపోయాయి. బురదను తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయని సహాయక సిబ్బంది వెల్లడిస్తున్నారు. గత మూడు రోజుల నుండి సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.
కేరళలోని వయనాడ్ జిల్లాలోని ముండక్కై ప్రాంతంలో భారీ వర్షాలు కారణంగా సోమవారం ఆర్దరాత్రి దాటిన అనంతరం కొండచరియలు విరిగిపడి అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. సహాయక శిబిరాలు ఏర్పాటు చేసిన ప్రదేశంలో మరోసారి కొండచరియలు విరిగిపడటంతో ఇళ్లతోపాటు శిబిరాలలో ఉన్న వారు కూడా కొట్టుకుపోయారు. బురదలో కూరుకుపోయి, వరదలో కొట్టుకుపోయి అనేక మంది ప్రజలు మృత్యువాత పడ్డారు.