లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాది అరెస్ట్: NIA
ఢిల్లీ (CLiC2NEWS): మనదేశంలో ఉగ్రకార్యకలాపాలకు పాల్పడి పరారైన లష్కరే ఉగ్రవాదిని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కస్టడీలోకి తీసుకుంది. రువాండాలోని కిగాలీ ప్రాంతంలో నవంబర్ 27న అరెస్టు చేశారు. కర్ణాటకలో పలు ఉగ్రవాద దాడులకు పాల్పడిన సల్మాన్ రెహ్మాన్ ఖాన్ ను ఇంటర్‌పోల్ సహకారంతో సిబిఐ, ఎన్ ఐఎ భారత్‌కు రప్పించారు. ఈ మేరకు అధికారులు వెల్లడించారు.
లష్కరే తోయిబాకు చెందిన సల్మాన్ రెహ్మాన్ ఖాన్ బెంగళూరులో పలు ఉగ్రవాద కార్యకలాపాలకు పల్పడ్డాడు. అక్కడి జైళ్లపై జరిగిన ఉగ్రదాడులకు ఆయుధాలు, పేలుడు పదార్ధాలను సరఫరా చేసినట్లు అతనిపై అభియోగాలున్నాయి. ఈకేసులో దర్యాప్తు చేపట్టిన ఎన్ ఐఎ .. నిందితుడు దేశం విడిచి పారిపోయినట్లు గుర్తించారు. దీంతో సిబిఐ ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించిన జాతీయ దర్యాప్తు సంస్థ ఆగస్టు 2న అతడిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది.