ఆరోగ్య తెలంగాణను నిర్మిద్దాం.. మంత్రి కెటిఆర్
వేములవాడలో హెల్త్‌ప్రొఫైల్ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించిన మంత్రి
సిరిసిల్ల (CLiC2NEWS): హెల్త్‌ప్రొపైల్ ద్వారా ఆరోగ్య తెలంగాణ నిర్మించి దేశానికే ఆదర్శవంతం కావాలని, దీని కోసం కేటాయించిన ప్రతి పైసా సద్వినియోగం చేసుకుందామని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖా మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. వేములవాడలో హెల్త్‌ప్రొఫైల్ పైలట్ ప్రాజెక్టును మంత్రి శుక్రవారం ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోదైన నాటి నుండి రాష్ట్ర వైద్యారోగ్య సిబ్బంది అహర్నిశలు శ్రమించారని, వారందరికీ మనం ఋణపడి ఉండాలన్నారు. కరోనా సోకిన వారికి వైద్య సేవలందిస్తూ.. వైద్యులు, ఇతర సిబ్బంది తతమ కుటుంబాలను మరిపోయారని వారి సేవలను కొనియాడారు. పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసులు లాక్‌డౌన్ సమయంలో తీవ్రంగా శ్రమించారని ప్రశంసించారు.
రాష్ట్రంలోని ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందంచాలన్న ఉద్దేశంతో ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ ప్రక్రియ చేపట్టామని మంత్రి తెలిపారు. ప్రతి ఇంటికి వైద్యారోగ్య వాఖ అధికారులు, సిబ్బంది వెళ్లి, వైద్య పరీక్షలు నిర్వహించి వివరాలని ట్యాబ్‌లో నమోదు చేసుకుంటారు. రక్త పరీక్షల కోసం నమూనాలను సేకరించి, సిరిసిల్ల టీ డయాగ్నోస్టిక్ సెంటర్‌కు పంపిస్తారు. ఆ పరీక్షల వివరాలు కూడా నమోదు చేసుకుంటారని అన్నారు. హెల్త్‌రికార్డుల నమోదు వలన రోడ్డు ప్రమాదాలు జరిగినపుడు, అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు ఎమర్జెన్సీ అవసరమైనపుడు ఉపయోగపడతాయని తెలిపారు. అలాంటి పరిస్థితులలో రోగి వేలిముద్ర లేదా ఐరిష్‌తో అన్ని రికార్డులు, వివరాలు తెలుసుకొని వెంటనే చికిత్స ప్రారంభించం జరుగుతుందన్నారు. అత్యవసర సమయంలో విలువైన అరగంట సమయం కూడా వృధా కాకుండా ప్రాణం కాపాడడానికి ఉపయోగపడుతుందని మంత్రి వివరించారు. ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో ప్రారంభిస్తున్నామని తెలిపారు.