మెట్రోను ఆదుకుంటాం: ముఖ్యమంత్రి కెసిఆర్
హైదరాబాద్ (CLiC2NEWS): కరోనా వల్ల ప్రయాణాలు తగ్గి ఆర్ధికంగా నష్టాల్లో ఉన్న హైదరాబాద్ మెట్రో ను ఆదుకునేందుకు అన్ని అంశాలు అన్వేషిస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ తెలిపారు. ప్రగతి భవన్‌లో సిఎం కెసిఆర్ ను మంగళవారం నాడు ప్రగతి భవన్ లో ఎల్ అండ్ టి ఉన్నతాధికారులు భేటి అయ్యారు. కరోనా కాలంలో మెట్రో ఎదుర్కోంటున్న ఆర్థిక నష్టాలను, బ్యాంకు అప్పులు, రోజురోజుకు పేరుకుపోతున్న వడ్డీల వివరాలను సమావేశంలో చర్చించి తమను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా సిఎం కేసిఆర్ మాట్లాడుతూ..
అనతి కాలంలోనే సురక్షిత ప్రజా రవాణా వ్యవస్థగా హైదరాబాద్ మెట్రో సేవలందిస్తూ ప్రజాధరణ పొందిందన్నారు. కరోనా పరిస్థితులు అన్ని రంగాలను ప్రభావితం చేసినట్లే మెట్రోను కూడా ఇబ్బందుల్లోకి నెట్టిందని సిఎం కేసిఆర్ తెలిపారు. దినాదినాభివృధ్ది చెందుతున్న హైదరాబాద్ నగరానికి మెట్రో సేవలు ఎంతో అవసరమని, భవిష్యత్తులో మెట్రో మరింతగా విస్తరించాల్సి వుందన్నారు. కరొనా దెబ్బతో మెట్రో అప్పుల్లో కూరుకుపోవడం, వడ్డీలకు వడ్డీలు కట్టాల్సి రావడం శోచనీయమన్నారు.అన్ని రంగాలను ఆదుకున్నట్లే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక హైదరాబాద్ మెట్రోను కూడా గాడిలో పెట్టడానికి తమవంతు కృషి చేస్తుందన్నారు. ఎటువంటి విధానాలు అవలంభించడం ద్వారా మెట్రోకు మేలు చేయగలుగుతామో విశ్లేషిస్తామని తెలిపారు. సాధ్యాసాధ్యాలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. ప్రజావసరాల దృష్ట్యౌ కరోనా వంటి క్లిష్ట సందర్భాల్లో వినూత్నంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవలసి వస్తుందన్నారు. హైదరాబాద్ మెట్రోను ఆదుకోవడంతో పాటు తిరిగి పుంజుకుని ప్రజావసరాల దృష్ట్యా మరింతగా విస్తరించే దిశగా చర్యలు చేపడతామని సిఎం తెలిపారు. ఇందుకు గాను విస్తృతంగా చర్చించి పుర్వాపరాలను పరిశీలించి ఏ విధానం అవలంభించడం ద్వారా మెట్రోకు పూర్వవైభవాన్ని తీసుకురాగలమో అవగాహన కోసం ఒక అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సిఎం ప్రకటించారు.
ఈ కమిటీలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఎంఎయూడి స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ వుంటారని సిఎం తెలిపారు.