బంగాళాఖాతంలో అల్పపీడంన.. సోమ, మంగళవారల్లో భారీ వర్షం!
హైదరాబాద్ (CLiC2NEWS): బంగాళాఖాతంలో ఆదివారం ఏర్పడనున్న ఆవర్తన ప్రభావంతో సోమ, మంగళవారాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఆవర్తనం ప్రభావంతో విదర్భ నుంచి అంతర్గత కర్ణాటక వరకు ఒక ద్రోణి కొనసాగుతున్నట్లు ఐఎండి శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. శనివారం తెలంగాణలో వేర్వేరు చోట్ల పిడుగుపాటు కారణంగా ముగ్గురు మృతి చెందారు. మంచిర్యాల జిల్లా భీమారంలో బండారి లింగయ్య (58), కరీంగనర్ జిల్లా చొప్పదండి మండలం కోనేరు పల్లిలో అప్పాల కొమురమ్మ (70), కుమురం భీం జిల్లా బెజ్జూరు మండలం పోతపల్లి కి చెందిన తొశం పోసక్క (23) మృతి చెందారు.
హైదరాబాద్‌లో ఇవాళ (ఆదివారం) తెల్లవారు జామున నుంచి భారీ వర్షం కురుస్తోంది. హైదరాబాద్ సహా రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో వాన పడుతోంది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం దంచి కొడుతోంది. భారీ వర్షంతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాల్లో వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో జిహెచ్ ఎంసి అధికారులు అప్రమత్తమయ్యారు. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపైకి భారీగా నీరు చేరింది. దీంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.