`మా` ఎన్నికల తేదీ ఖరారు
హైదరాబాద్ (CLiC2NEWS): `మా` ఎన్నికల నిర్వహణపై నెలకొన్న ఉత్కంఠ కు ఎట్టకేలకు తెరపడింది. తెలుగు సినీ పరిశ్రమ మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల తేదీ ఖరారైంది. అక్టోబరు 10న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ‘మా’ క్రమశిక్షణ సంఘం తెలిపింది. దీంతో ఇక అధ్యక్ష అభ్యర్థులు, వారి ప్యానెల్ సభ్యులు ప్రచారం ముమ్మరం చేయనున్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ప్రధానంగా పలువురు అభ్యర్థులు పోటీ చేస్తామనడంతో ‘మా ’ అధ్యక్ష ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుతం ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, సీవీఎల్ నరసింహరావు, హేమ, జీవిత ప్రధానంగా బరిలో ఉన్నట్టు సమాచారం. వీరితోపాటు మరికొందరు ఎన్నికల్లో పోటీచేస్తారని వార్తలు ఇప్పటికే తెరపైకి వచ్చాయి. మరి చివరి నిమిషంలో ఎవరైనా బరిలోకి దిగుతారా..? లేదంటే ఏకగ్రీవంవైపు అడుగులు వేస్తారా..? అనేది తెలియాల్సి ఉంది.