సింగరేణి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికుల మహాధర్నా..
![](https://clic2news.com/wp-content/uploads/2023/04/Singareni-workers-protesting-the-privatization.jpg)
పెద్దపల్లి (CLiC2NEWS): బొగ్గుగనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. సింగరేణి వ్యాప్తంగా కార్మికులు మహాధర్నా నిర్వహించారు. శనివారం ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటనకు వస్తున్న విషయం తెలిసినదే. ఈ నేపథ్యంలో ఆయన పర్యటనను వ్యతిరేకిస్తూ మోదీ హటావో సింగరేణి బచావో అంటూ నినాదాలు చేశారు. రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ పిలుపు మేరకు టిబిజికెఎస్ ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి మహాధర్నా చేపట్టారు.
పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖని చౌరస్తాలో నిర్వహించిన మహాధర్నాలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పాల్గొని నిరసనలు వ్యక్తం చేశారు. భూపాలపల్లిలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. పేదల పొట్టలు కొట్టి పెద్దలకు పంచడమే మోడీ విధానమని.. సింగరేణి ప్రేవేటీకరణ ఆపే వరకు ఉద్యమిస్తామని మంత్రి ఎర్రబెల్లి స్పష్టం చేశారు. కొత్తగూడెంలో నిర్వహిస్తున్న ధర్నాలో మంత్రి పువ్వాడ అజయ్, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎంపి వద్ది రాజు రవి చంద్ర, ఎమ్మెల్యేలు వనమా, సండ్ర వెంకట వీరయ్య పాల్గొని నిరసనలు తెలిపారు.