పాలకుర్తిలోని 104 పాఠశాలలో ‘మన ఊరు-మనబడి’ కార్యక్రమం అమలు: మంత్రి ఎర్రబెల్లి
జనగామ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రూ. 7,289 కోట్లతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మన ఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం రూ. 3,497 కోట్ల వ్యయంతో రాష్ట్రంలోని 9,123 ప్రభుత్వ పాఠశాలలో మన ఊరు-మనబడి కార్యక్రమం అమలు చేయనున్నారు. పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో 104 ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో ఈ కార్యక్రమం అమలు చేయబడుతుందని మంత్రి తెలిపారు. పాలకుర్తి మండలంలోని 24 పాఠశాలలో, కొడకండ్ల మండలంలోని 11 పాఠశాలల్లో, పెద్దవంగర మండలంలోని 12 పాఠశాలల్లో, దేవరుప్పుల మండలంలోని 18 పాఠశాలలో, రాయపర్తి మండలంలోని 21 పాఠశాలలో, తొర్రూరు మండలంలోని 18 పాఠశాలలో మన ఊరు మన బడి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు.
పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనలో పాటుగా నాణ్యమైన విద్యార్థులకు అందించాలనే సంకల్పంతో మన ఊరు మన బడి కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. పాఠశాలలో డిజిటల్ విద్య అమలు, విద్యుదీకరణ, త్రాగునీటి సరఫరా, సరిపడా ఫర్నీచరు, పాఠశాలల్లో అవసరమైన మరమ్మతులు, పాఠశాలకు రంగులు వేయడం, గ్రీన్ చాక్ బోర్డ్ ల ఏర్పాటు, ప్రహరీ గోడ నిర్మాణం. కిచెన్ షెడ్ల నిర్మాణం, అదనపు తరగతి గదుల నిర్మాణం, ఉన్నత పాఠశాలలో డైనింగ్ హాల్ ల నిర్మాణం, నీటి సౌకర్యాలతో కూడిన మరుగుదొడ్ల నిర్మాణం మున్నగు సదుపాయాలను మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని ఆయన తెలిపారు.
మన ఊరు మన బడి కార్యక్రమం పై అందరికీ అవగాహన కల్పించడానికి, భాగస్వాములను చేయడానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని జిల్లా కేంద్రల్లో, అన్ని అసెంబ్లీ నియోజకవర్గలో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించమని ఆయన తెలిపారు. అందులో భాగంగా పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ప్రజాప్రతినిధులకు, ఉపాధ్యాయులకు, అధికారులకు, ఉద్యోగులకు, పాఠశాల యాజమాన్య కమిటీలకు, స్వచ్ఛంద సంస్థల వారికి అవగాహన కార్యక్రమాలను నిర్వహించామని ఆయన తెలిపారు. రెక్కాడితే కానీ డొక్కాడని తల్లిదండ్రులు సైతం కడుపు కట్టుకొని పిల్లలను ఇంగ్లీష్ మీడియం చదువుల కోసం ప్రైవేట్ స్కూల్ లకు పంపిస్తున్నారని మంత్రి తెలిపారు. అందరి ఆకాంక్ష మేరకు వచ్చే విద్యా సంవత్సరం నుండి ఇంగ్లీష్ మీడియాన్ని ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశపెట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకోసం ఇంగ్లీషు, తెలుగులో ద్విభాషా పుస్తకాలు సిద్ధం చేస్తున్నామని ఆయన తెలిపారు. దీనికి తోడుగా ఇంగ్లీష్ మీడియం బోధన పై ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నామని ఆయన తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మొదలైన మన ఊరు మన బడి విద్య యజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై పాఠశాలల అభివృద్ధికి రాజకీయాలకతీతంగా ముందుకు రావాలని ఆయన కోరారు. పాఠశాలల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి తోడుగా దాతలు విరాళాలు అందించాలని ఆయన కోరారు. ప్రతి ఒక్కరూ తాము చదువుకున్న పాఠశాల రుణం తీర్చుకునేందుకు కృషి చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.