‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణస్వీకారం

హైదరాబాద్ (CLiC2NEWS): మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మంచు విష్ణు శనివారం ప్రమాణస్వీకారం చేశారు. విష్ణుతో పాటు ఆయన ప్యానెల్ నుంచి గెలుపొందిన 15 సభ్యులతో మా ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ ప్రమాణస్వీకారం చేయించారు. ‘మా’లో నూతన కార్యవర్గం కొలువుదీరింది. హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్‌లో శనివారం నిర్వహించిన ఈ వేడుకకు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మోహన్ బాబు, నరేశ్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ప్రమాణస్వీకారం చేసిన అనంతరం మంచు విష్ణు, మోహన్ బాబు ఆశీస్సులు తీసుకున్నారు.
హాజరుకాని ప్రకాశ్‌రాజ్ ప్యానెల్..
మా ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ నుంచి 11 మంది విజయం సాధించినప్పటికీ.. కొన్ని కారణాల వల్ల తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా జరిగిన ‘మా’ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారానికి ప్రకాశ్‌రాజ్, అతని ప్యానెల్ సభ్యులెవరూ హాజరు కాలేదు.