ఎన్‌డిఎ అభ్యర్థి ద్రౌపది ముర్మూకు మాయావతి మద్దతు..
ఢిల్లీ (CLiC2NEWS): రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డిఎ అభ్యర్థి ద్రౌపది ముర్మూకు బిఎస్‌పి మద్దతు ప్రకటించింది. ఈ మేరకు తమ నిర్ణయాన్ని పార్టీ అధినేత్రి మాయావతి శనివారం వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బిజెపికి మద్దతుగానో.. లేక ప్రతిపక్ష కూటమికి వ్యతిరేకంగానో తాము ఈ నిర్ణయం తీసుకోలేదని అన్నారు. తమ పార్టీ సిద్ధాంతాలను, తమ ఉద్యమాన్ని దృష్టిలో ఉంచుకునే గిరిజన తెగకు చెందిన అభ్యర్థికి మద్దతివ్వాలని నిర్ణయించామని అన్నారు.
“దళితుల చేతుల్లో నాయకత్వం ఉన్న ఏకైక జాతీయ పార్టీ బిఎస్‌పి. మేం బిజెపి లేదా కాంగ్రెస్‌ను అనుసరించేవాళ్లం కాదు. పారిశ్రామికవేత్తలతో కూడా చేతులు కలపలేదు. మేం ఎప్పుడూ అణగారిన వర్గాలకు మేలు చేసే నిర్ణయాలే తీసుకుంటాం. ఏ పార్టీయైనా అలాంటి వర్గాలకు మద్దతుగా నిర్ణయాలు తీసుకుంటే పర్యవసనాలను పక్కనపెట్టి వారి వెంట నిలుస్తాం” అని మాయావతి అన్నారు. మరోవైపు రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసే సమయంలో ప్రతిపక్ష కూటమి తమని సంప్రదించలేదని, ఎంపిక చేసిన పార్టీలనే మమతా బెనర్జీ పిలిచారన్నారు. దీనిపై అసహనం వ్యక్తంచేశారు.