రాచకొండ కమిషనరేట్.. పిల్లలు లేకపోతే బతకలేమంటున్న పెంపుడు తల్లిదండ్రులు

హైదరాబాద్ (CLiC2NEWS): రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మేడిపల్లి పోలీసులు చిన్నారులను విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వారి నుండి కొనుగోలు చేసిన 16 మందిని గుర్తించారు. ఆ చిన్నారులను పెంచుకుంటున్న దంపతులను కమిషనరేట్ కార్యాలయానికి రప్పించారు. వారి వద్ద నుండి పోలీసులు చిన్నారులను స్వాధీనం చేసుకున్నారు. ఇన్నాళ్లుగా పెంచుకున్న బంధం నుండి మా బిడ్డలను విడదీయొద్దు ఆ పెంపుడు తల్లుల రోదనలు మిన్నంటాయి. పేగుబంధం కాకున్నా కంటిపాపలా చూసుకున్నామని, దయచేసి మాబిడ్డను తీసుకెళ్లొద్దంటూ దంపతులు విలపిస్తున్నారు. మరోవైపు ఏడాది , రెండేళ్లుగా పెరిగిన ఆ పిల్లలు సైతం పోలీసుల వద్దకు వెళ్లనంటూ ఏడుస్తున్నారు.
చిన్నారులను కొనుకున్న పిల్లలు లేని తల్లిదండ్రులు ఆ బిడ్లలను అల్లారుముద్దుగా పెంచుకుంటుండగా .. పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పిల్లలు లేకపోతే బతకలేమంటూ రోదిస్తున్నారు. తాను లేకపోతో తమబిడ్డ అన్నం కూడా తినడు అంటూ .. ఇపుడు ఎలా ఉన్నాడో అంటూ ఏడుస్తున్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి.
మరోవైపు చిన్నారులను ఇలా కొనుగోలు చేయడం నేరం అంటున్నారు పోలీసులు . సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటి ద్వారా పిల్లలు లేని వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర పద్దతులలో ఏవిధంగా పిల్లలను కొనుగోలు చేసిన అది చట్ట వ్యతిరేకమవుతుందని తెలిపారు.