సామల సదాశివ విగ్రహాన్ని ఆవిష్క‌రించిన ఎమ్మెల్యే కోన‌ప్ప‌

కాగ‌జ్‌న‌గ‌ర్ (CLiC2NEWS):  కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ సామల సదాశివ్ మాస్టారు కాంస్య విగ్రహన్ని ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ, ఆదిలాబాదు ఎమ్మెల్సీ పురాణం సతీష్, మాజీ మంత్రులు, శాసనసభ్యులతో కలిసి ఆవిష్కరించిన సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప..

కాగజ్ నగర్ పట్టణంలోని బస్టాండ్ ఎదురుగా.. కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మితమైన నిత్యాన్నదాన సత్రం ఆవరణలో బుధ‌వారం ఉదయం  కేంద్ర సాహిత్య అవార్డ్ గ్రహీత, సాహితీ వేత్త సామల సదాశివ కాంస్య విగ్రహన్ని ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ, ఆదిలాబాదు ఎమ్మెల్సీ పురాణం సతీష్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జోగు రామన్న, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, అసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు లతో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కోనేరు కోనప్ప మాట్లాడుతూ.. “సామల సదాశివ బహుముఖ ప్రజ్ఞాశాలి, సంగీతం పట్ల అపారమైన జ్ఞానం కలవారు, బహుభాషావేత్త, ఉర్దూ రుబాయీలు తెలుగు లోకి అనువాదం చేసి వాటి గొప్పతనాన్ని తెలుగు ప్రజలకు తెలియజేశారు, సదాశివకు  తెలుగు, సంస్కృతం, హిందీ, ఇంగ్లీషు,  ఉర్దూ, పార్సీ, మరాఠీ భాషల్లో మంచి ప్రావీణ్యం ఉంది. ఉర్దూ పత్రిక సియాసత్ లో సదాశివ వ్యాసాలు అనేక ఏళ్ళుగా ప్రచురించబడ్డాయి.

వారి జీవితమంతా సాహితీ సేవకే అంకితంచేశారు. అతన్ని స్ఫూర్తిగా తీసుకొని అతని మార్గదర్శకత్వంలో మన ప్రాంతం నుండి ఎంతోమంది సాహిత్యరంగంలో ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. దాని కంతటికీ వారి మార్గదర్శనం, దార్శనికత, గొప్ప వ్యక్తిత్వం కారణం. సామల సదాశివ మలయమారుతాలు, సంగీత శిఖరాలు, యాది వంటి వ్యాస సంకలనాలు, అంజద్ రుబాయీలు, ఉర్దూ సాహిత్య చరిత్ర, మౌలానా రూమీ మస్నవీ, ఉర్దూ కవుల కవితా సామగ్రి, మిర్జా గాలిబ్ పుస్తకాలు మిర్జా గాలిబ్ రచనలు, ఉర్దూ సాహిత్య చరిత్ర వంటి రచనలు చేశారు. మలయ మారుతాల్లో అతడు మనకు హిందుస్తానీ సంగీత ప్రపంచాన్ని, అందులోని కళాకారులను,, వారి గొప్పదనాన్ని, ఆత్మాభిమానాన్ని కళ్ళకు కట్టినట్టు వివరిస్తాడు. ముచ్చట్ల రూపంలో మనకు అర్ధం అయ్యేటట్టు చెప్పడం అతనికున్న ప్రత్యేకత. అతని భాషా, శైలీ చాలా సహజ సుందరంగా ఉంటాయి. ఉస్తాద్ అబ్దుల్ కరీంఖాన్, హీరాబాయి బరోడేకర్, బడే గులాం అలీఖాన్, అల్లాదియా ఖాన్, బేగం అఖ్తర్, గంగూబాయి హంగల్, కేసర్ బాయి కేర్కర్, ఉస్తాద్ అంజద్ అలీ ఖాన్, ఇలా ఎందరో సంగీత విద్వాంసులను, వారు ఆలపించే విధానాలను వివరించాడు. అతను ఎన్నో అవార్డులు అందుకున్నారు, మన కేంద్ర ప్రభుత్వం 2011లో అతనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఇచ్చి అతని సాహిత్య సేవలను గుర్తించింది, నేటి యువత, కవులు, కళాకారులు వారిని ఆదర్శంగా తీసుకుని వారి సాహిత్యం చదివి మంచి రచనలు చేయాలని“ అని ఎమ్మెల్యే కొన‌ప్ప తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లా ఎస్పీ సుధీంద్ర, అడిషనల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి, తెలుగు సాహిత్య సదస్సు నాయకులు, సభ్యులు, సదాశివ మాస్టారు కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు, పద్మశాలి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.