మూసీ ప్రక్షాళన ఆగదు.. సిఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ (CLiC2NEWS): ఎవరు అడ్డుపడినా మూసీ ప్రక్షాళన ఆగదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన కొలువుల పండుగ కార్యక్రమంలో సిఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రభత్వ ఉద్యోగాలకు ఎంపికైన 1,635 మందికి నియామక పత్రాలు అందజేశారు. ఉద్యోగాలు పొందిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ పునర్నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలంటూ సిఎం పిలుపునిచ్చారు. 55 కిలోమీటర్ల మూసీ రివర్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు పూర్తి చేసి దేశానికి ఆదర్శంగా నిలబెడతామని ఆయన అన్నారు.
అక్టోబర్ 9వ తేదీన ఎల్బిస్టేడియంలో 11,063 టీచర్ల ఉద్యోగ నియామక పత్రాలు అందించబోతున్నట్లు సిఎం తెలిపారు. గత పదేళ్లలో నియామకాలు జరగక నిరుద్యోగ యువకులు నిరాశ చెందారు. మా మంత్రి వర్గం ఆలోచన చేసి సంవత్సరాల కొద్దీ వాయిదా పడుతున్న ప్రభుత్వ ఉద్యోగాలకు పరిష్కారం చూపించిందని అన్నారు. వందేళ్ల అనుభవం ఒకవైపు.. పదేళ్ల దుర్మార్గం ఒకవైపు ఉందని.. విశ్వాసంతో ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకుందాంమని సిఎం అన్నారు.
మూసీ పరివాహక ప్రజలు దశాబ్దాలుగా మురికిలోనే ఉండాలా.. నిర్వాసితులను ఎలా ఆదుకోవాలో సలహాలు ఇవ్వండని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజలు నిరాశ్రయలు అవుతారని ప్రాజెక్టులు కట్టకుండా ఉంటారా.. మల్లన్న సాగర్ , కొండపోచమ్మ , గంధమల్లు రిజార్వాయర్ల నిర్మాణం వల్ల ఎవరి భూములూ పోలేదా అని ప్రశ్నించారు. మల్లన్న సాగర్ పేరుతో రైతులను బలవంతంగా ఖళీ చేయించారన్నారు. మూసీ నిర్వాసితులకు మంచి స్థలంలో ఆశ్రయం కల్పిస్తామన్నారు.