దేశంలో పరిపాలనా భాషలుగా మాతృభాషలే ఉండాలి: ఉపరాష్ట్రపతి

హైదరాబాద్(CLiC2NEWS): ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నాంపల్లిలోని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తెలుగు భాష అభివృద్ధి కోసం ఏర్పడిన తెలుగు విశ్వవిద్యాలయం దేశంలో భాషా ప్రాతిపదికన ఏర్పాటైన రెండో విశ్వవిద్యాలయం కావడం గర్వకారణమని వెంకయ్యనాయుడు అన్నారు. దేశంలో పరిపాలనా భాషలుగా మాతృభాషలే ఉండాలని ఆకాంక్షించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తెలుగుభాష, సంస్కృతి అబ్యున్నతి కోసం చూపిస్తున్నా చొరవ అభినందనీయం అని వెంకయ్యనాయుడు అన్నారు. తెలుగు విశ్వావిద్యాలయం అభివృద్ధికోసం, తెలుగు భాషాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ప్రశంసనీయమని కొనియాడారు. ఇదే మాదిరిగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు భాష, సంస్కృతి, కళలను కాపాడుకునేందుకు కృషి చేయాలని, ఆధునిక కాలానికి అనుగుణంగా తెలుగు భాషను ప్రతి ఒక్కరికీ చేరువ చేయాలని అన్నారు.