సినీనటుడు రాజబాబు కన్నుమూత

హైదరాబాద్ (CLiC2NEWS): ప్రముఖ సినీ నటుడు రాజబాబు (64) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య, ఇద్దరు కమారులు, కుమార్తె ఉన్నారు. ఆయ మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
రాజబాబు ఎపిలోని తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలంలోని నరసాపురపేటలో 1957 జూన్ 13న జన్మించారు. తొలుత ఆయన రంగస్థల నటుడిగా తన నట జీవితాన్ని ప్రారంభించారు. 1995లో వచ్చిన ఊరికి మొనగాడు చిత్రంతో రాజబాబును సినిమా రంగానికి పరిచయం అయ్యారు. పలు సినిమాలు, టీవీ సీరియళ్లలో నటించారు.
సింధూరం, సముద్రం, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, మురారీ, శ్రీకారం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, కళ్యాణ వైభోగం, మళ్ళీ రావా?, బ్రహ్మోత్సవం, భరత్ అనే నేను తదితర చిత్రాల్లో సహాయ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చకున్నారు. దాదాపు 62 చిత్రాలలో నటించిన ఆయన విభిన్నమైన పాత్రలు పోషించారు. సినిమాల్లోనే కాకుండా పలు సీరియళ్లలో కూడా నటించి మెప్పించారు రాజబాబు. వసంత కోకిల, అభిషేకం, రాధా మధు, మనసు మమత, బంగారు కోడలు, బంగారు పంజరం, నా కోడలు బంగారం, చి ల సౌ స్రవంతి వంటి సీరియల్స్ లో నటించారు. 2005లో `అమ్మ` సీరియల్లోని పాత్రకు ఆయనకు నంది అవార్డ్ కూడా దక్కింది.