మట్టిమిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు మృతి.. రూ.10 లక్షల సాయం ప్రకటించిన ప్రభుత్వం
అమరావతి (CLiC2NEWS): మట్టి మిద్దె కూలి కుటుంబంలోని నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటన నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం చిన్నవంగలిలో చోటుచేసుకుంది. ఇటీవల కురిసిన వర్షాలకు బాగా తడిసిపోయిన మట్టి మిద్దె కూలిపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతి చెందినవారిలో తల్లపురెడ్డి గురుశేఖర్ ఆయన భార్య, వారి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మరో కుమార్తె ప్రసన్న ప్రొద్దుటూరు వసతి గృహంలో పదో తరగతి చదువుకుంటోంది. అర్ధరాత్రి ఈ ఘటన జరగడంతో ఎవరూ గుర్తించలేకపోయారు. తెల్లవారుజామున స్థానికులు మట్టిని తొలగించిన ఫలితం లేకపోయింది.
ఈ ఘటనపై సిఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరపున రూ.10 లక్షల సాయం ప్రకటించారు. ప్రసన్న ప్రస్తుతం నాయనమ్మ సంరక్షణలో ఉంది. ఆమె పేరుమీద రూ. 10 లక్షలు డిపాజిట్ చేయడంతోపాటు ఆమె నాయనమ్మకు రూ. 2 లక్షలు సాయం అందించాలని అధికారులను ఆదేశించారు.