జులై 1 నుండి దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధం..
ఢిల్లీ (CLiC2NEWS): ప్లాస్టిక్ వస్తువులపై దేశవ్యాప్తంగా జులై 1 వ తేదీనుండి నిషేధం అమలులోకి రానున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. తక్కవ పరిమాణం కలిగిన, ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్ వస్తువులను తయారు చేయడం, దిగుమతి చేసుకోవడం, నిల్వ ఉంచుకోవడం, సరఫరా, అమ్మకంతో పాటు వినియోగాన్ని కూడా పూర్తిగా నిషేధిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. దీనికి సంబంధించిన నిషేధిత జాబితాలో ఏయే వస్తువులు ఉన్నాయో తెలియజేస్తూ తాజాగా ప్రకటన జారీ చేసింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు ఒకేసారి వాడిపారేసే ప్లాస్టిక్‌ను నిషేధాన్ని అమలులోకి తెస్తున్నట్లు పర్యావరణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పెట్రో కెమికల్ సంస్థలు కూడా ప్లాస్టిక్ ముడిసరుకును వస్తువులను తయారుచేసే పరిశ్రమలకు సరఫరా చేయవద్దని ఉత్తర్వులు జారీచేసింది. ఏ వాణిజ్య సంస్థా తమ పరిధిలో ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్ ఉపయోగించరాదని షరతు విధిస్తూ స్థానిక సంస్థలు లైసెన్సులు జారీ చేయాలని, ఒకవేళ ఎవరైనా ఉపయోగించినా, లేదంటే నిషేధిత ప్లాస్టిక్ వస్తువులు విక్రయించినా వాటి లైసెన్సులు రద్దు చేయాలని స్థానిక స్థలకు ఆదేశాలు జారీ చేసింది.
నిషేధిత జాబితాలో ఉన్న ప్లాస్టిక్ వస్తువులు..
- ఇయర్‌బడ్స్
- బెలూన్లకు వాడే ప్లాస్టిక్ స్టిక్స్
- ప్లాస్టిక్ జెండాలు
- క్యాండీ స్టిక్స్-పిప్పరమెంట్లకు వాడే ప్లాస్టిక్ పుల్లు
- ఐస్‌క్రీమ్ పుల్లలు
- అలంకరణ కోసం థర్మాకోల్
- ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పులతో పాటు గ్లాసులు, ఫోర్క్‌లు, స్పూన్లు, స్ట్రాలు
- వేడి పదార్తాలు, స్వీట్ బాక్సుల ప్యాకింగ్‌కు వాడే పల్చటి ప్లాస్టిక్
- ఆహ్వాన పత్రాలు
- సిగరెట్ ప్యాకెట్లు
- 100 మైక్రాన్లలోపు ఉండే ప్లాస్టిక్ లేదా పివిసి బ్యానర్లు
- ద్రవ పదార్థాలను కలిపేందుకు వాడే పుల్లలు
![]()
