జలమండలిలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

హైదరాబాద్(CLiC2NEWS): ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. జలమండలి ఇంజనీర్స్ అసోసియేషన్(జేఇఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా జలమండలి ఎండీ దానకిశోర్ పాల్గొన్నారు. జలమండలి డైరెక్టర్లు, ఉద్యోగులు, సిబ్బందికి ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. జేఇఏ నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా దానకిశోర్ మాట్లాడుతూ.. గత సంవత్సరం జలమండలి మీద ఉన్న నమ్మకంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను అప్పగించిందన్నారు. కాబట్టి, వాటిని సకాలంలో పూర్తి చేయడానికి ఈ సంవత్సరం జలమండలికి అత్యంత కీలకమని, రికార్డు స్థాయిలో ఈ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఇంజనీర్లు, ఉద్యోగులు కృషి చేయాలని పేర్కొన్నారు. గత రెండేళ్లుగా కరోనా ప్రభావం వల్ల పలువురు సహోద్యోగులను కోల్పోవడం బాధాకరమని అన్నారు. మరణించిన ఉద్యోగుల కుటుంబీకులకు సకాలంలో పెన్షనరీ బెనిఫిట్స్ అందించినట్లు తెలిపారు. అర్హులైన కుటుంబసభ్యులకు కంపాషినేట్ గ్రౌండ్స్‌లో ఉద్యోగాలు ఇచ్చి జలమండలి ఆదుకుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఈడీ డా.ఎం.సత్యనారాయణ, ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీధర్ బాబు, రెవెన్యూ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్ కుమార్, ఆపరేషన్ డైరెక్టర్లు అజ్మీరా కృష్ణ, స్వామి, టెక్నికల్ డైరెక్టర్ రవి కుమార్, సీజీఎంలు, జలమండలి ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి హరిశంకర్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.